అమరావతి రాజధానిని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని, ప్రపంచమంతా తలతిప్పి ఇటువైపు చూసేలా ఈ నగరం ఉండాలనే దార్శనిక దృక్పథంతో చంద్రబాబునాయుడు తొలినుంచి కూడా అడుగులు వేస్తున్నారు. ఐకానిక్ నిర్మాణాలతో ఓ అద్భుత నగరంగా ఎలా ప్లాన్ చేస్తున్నారో.. అదే విధంగా సమీకృత అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రకరకాల ఆలోచనలను అమల్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందుకోసం.. అమరావతి నగరంలో దాదాపు 1700 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని చంద్రబాబు తొలుత సంకల్పించారు.
అయితే కార్యరూపంలోకి రావడానికి ముందే.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సదరు సంస్థలతో ఒప్పందాలను రద్దు చేసుకుని, వారిని భయపెట్టి, బెదరగొట్టి తరిమేశారు. వ్యవహారం మొదటికి వచ్చింది. అయితే చంద్రబాబునాయుడు తన పట్టుదలతో ఇప్పుడు వియత్నాం సంస్థల ద్వారా.. మిరంత మెరుగైన రూపంలో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసే పనులకు శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు జగన్ రూపంలో పట్టిన గ్రహణం త్వరలోనే వీడిపోనున్నదని అర్థమవుతోంది. అమరావతి నిర్మాణంలో ఇది ఒక కీలకమైన ముందడుగుగా పలువురు అభివర్ణిస్తున్నారు.
అమరావతి కి రూపకల్పన చేసిన సందర్భంలోనే.. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును చంద్రబాబునాయుడు అప్పట్లో సంకల్పించారు. అందుకోసం సింగపూర్ ప్రభుత్వంతో 2018లో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, అమరావతి నగరాన్ని మొత్తం స్మశానంగా మార్చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరించిన సంగతి అందరికీ తెలుసు. ఆయన కుట్రల్లో భాగంగానే.. స్టార్టప్ఏరియాకు కూడా గ్రహణంలా పట్టారు. సింగపూర్ సంస్థను రకరకాలుగా బెదిరించి, భయపెట్టి.. ఆ ఒప్పందాలు రద్దు చేసుకుని వారు వెళ్లిపోయే దాకా జగన్ ఊరుకోలేదు. అప్పటికి గానీ ఆయన శాంతించలేదు.
2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు.. తిరిగి స్టార్టప్ ఏరియా పై దృష్టి పెట్టారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ వల్ల.. సింగపూర్ మళ్లీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికే భయపడుతున్నదని.. చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్లే ముందే చాలా స్పష్టంగా వెల్లడించారు. అయినా సరే.. సింగపూరు పర్యటన వెళ్లి.. రాష్ట్రంలో పెట్టుబడుల దిశగా వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఇతర ప్రాజెక్టుల్లో అయినా వారి భాగస్వామ్యం కావాలని కోరారు.
అయితే, స్టార్టప్ ఏరియా అభివృద్ధి విషయానికి జగన్ రూపంలో పట్టిన గ్రహణానికి వియత్నాం రూపంలో విడుదల జరుగుతోంది. గతంలో 1679 ఎకరాల్లో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టును, ఇప్పుడు 2000 ఎకరాల్లో అభివృద్ధి చేయడానికి వియత్నాంకు చెందిన విన్ గ్రూపు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమ ప్రతిపాదనలను చంద్రబాబు ముందుంచినట్టు సమాచారం. చంద్రబాబునుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే.. ఈ వియత్నాం సంస్థ సీఆర్డీయేతో ఒప్పందాలు చేసుకుని.. పనులు ప్రారంభిస్తుందని కూడా అంటున్నారు. అమరావతి ప్రియులకు ఇది చాలా పెద్ద శుభవార్తే అని అనుకోవాలి.