ఒకవైపు రాజకీయాలు విమర్శలు ప్రతివిమర్శలతో హీటెక్కుతోంటే.. కడప ఎంపీ ఎన్నికకు సంబంధించిన మరో ఆసక్తికరమైన పరిణామం.. హైదరాబాదులో చోటుచేసుకుంటోంది. ఇక్కడి తెలంగాణ హైకోర్టులో.. కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కి గతంలో మంజూరుచేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతున్న పిటిషన్ చర్చకు వచ్చింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం సంధిస్తున్న ప్రశ్నలు చూస్తోంటే.. అవినాష్ రెడ్డి బెయిలు రద్దు కావచ్చుననే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది. ప్రస్తుతానికి ఆ పిటిషన్ ఏప్రిల్ 15 వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో ఆరోజున ఏ సంగతీ తేలుతుంది.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుల్లో ఒకరు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయన ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. కడప ఎంపీగా మళ్లీ పోటీచేస్తున్నారు. అయితే.. అవినాష్ రెడ్డి బయట ఉండడం వలన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని, తనకు కూడా బెదిరింపులు వస్తున్నాయని, తన తండ్రి మీద దాడులు కూడా జరిగాయని.. అందుచేత తక్షణం అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ గా మారిన మరో నిందితుడు దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం.
దస్తగిరి డిసెంబరులోనే ఫిర్యాదు ఇచ్చినప్పటికీ.. అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాల్సిందిగా ఇన్నాళ్లుగా మీరెందుకు కోరలేదు అంటూ.. న్యాయస్థానం దర్యాప్తు సంస్థ సీబీఐను ప్రశ్నించడం విశేషం. ప్రభుత్వ సంస్థ కావడం వలన అనుమతులకు కాస్త ఆలస్యం అవుతుందని సంజాయిసీ చెప్పుకున్న సీబీఐ తాజాగా, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుచేస్తే మాత్రమే సాక్షులకు రక్షణ ఉంటుందంటూ చాలా స్పష్టంగా కోర్టులో పేర్కొంది.
ఈ నేపథ్యంలో 15వేతేదీనాటి వాయిదాలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావచ్చుననే చర్చ జరుగుతోంది. ఈ పిటిషనుకు సంబంధించి.. అవినాష్ తరఫు న్యాయవాదులు చేస్తున్న వాదనలు అంతగా బలంగా లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెయిల్ రద్దు కోరుతూ మూడో వ్యక్తి పిటిషన్ వేయడానికి వీల్లేదంటూ వారు వాదనలు వినిపించారు. అయితే ఇలాంటి కేసుల్లో ఇతరులు కూడా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయచ్చునని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా వాదనల సందర్భంగా దస్తగిరి తరఫు న్యాయవాది వినిపించారు. పైగా దస్తగిరి తాను వేరే కేసులో జైలులో ఉండగా.. అవినాష్ తరఫు వ్యక్తులు వచ్చి తనను ఎలా భయపెట్టినదీ, ఎలా ప్రలోభపెట్టినదీ అంతా కూడా కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో 15వతేదీ వాయిదా కీలకం కానుంది.
బెయిలు రద్దయితే అవినాష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. 15వతేదీన బెయిలు రద్దయితే.. అప్పటికి ఎంపీ ఎన్నికల పోలింగుకు నెలరోజుల వ్యవధి ఉండవచ్చు గానీ.. జైలుకు వెళ్లడం వల్ల అవినాష్ కు వచ్చే సానుభూతి ఏమీ ఉండదు. మరింతగా ఆయన ఓటమికి దగ్గరవుతారనే సంగతి అర్థమవుతోంది.