జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అనేకమంది నెంబర్ టు లలో తాను కూడా ఒక కీలక నాయకుడిగా చలామణి అయిన బొత్స సత్యనారాయణ, సార్వత్రిక ఎన్నికలలో దారుణ పరాజయం తర్వాత రెండో మార్గంలో నుంచి చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది. తెలుగుదేశం పార్టీ పోటీనుంచి తప్పుకున్న తర్వాత.. బొత్స ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఆయన ఎన్నికను ప్రకటించడం అనే లాంఛనం మాత్రమే మిగిలుంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బొత్స సత్యనారాయణ విపక్ష నాయకుడిగా శాసనమండలిలో అడుగుపెట్టి ఏం సాధిస్తారు? ఆయనకు దక్కే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అనేది ఇప్పుడు ఆయన అనుయాయులలో చర్చనీయాంశంగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో బొత్స సత్యనారాయణ అడ్డగోలుగా చెలరేగిపోయారు. సీఎంగా మూడేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లోని అనేకమందిని మార్చి కొత్తవారిని తీసుకున్నప్పటికీ, బొత్సకు మాత్రం అలాంటి స్థానచలనం రాలేదు. మొత్తం ఐదేళ్లు కూడా ఆయన మంత్రి పదవిలోనే ఉన్నారు. మంత్రిగా ఉంటూ విపరీతంగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలను కూడా మూటగట్టుకున్నారు. చివరికి విద్యా శాఖ మంత్రిగా ఉంటూ ఉపాధ్యాయుల బదిలీల్లో కూడా విచ్చలవిడిగా సొమ్ము కాజేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు బొత్స సత్యనారాయణ మీద కేసు నమోదు చేయడానికి కొత్త ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేకంగా శాసనమండలిలో సభ్యుడు కావడం ద్వారా బొత్స సాధించబోయేది ఏముంటుంది? అనేది పలువురులో కలుగుతున్న సందేహం! అధికారం రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో ఉంది. కేవలం వారిని ఆడిపోసుకుంటూ సభలో నోరు పారేసుకోవాల్సిందే తప్ప బొత్సకు మరొక పని ఉండదు. ఈలోగా ఆయన మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే చట్టసభలో సభ్యుడిగా ఉంటూ అరెస్టు కావడం అనే రభస తప్ప మరో రక్షణ కూడా ఉండదు. అప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినా కూడా ఆశ్చర్యం లేదని ప్రజలు అనుకుంటున్నారు.