వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నదా? లేదా, అంబటి రాంబాబు తన సొంత భవిష్యత్తును పదిలంగా కాపాడుకోవడానికి తాను తలచిన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారా? అనే సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి అంబటి రాంబాబు కిర్లంపూడి లోని ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించి, కీర్తించి, స్తుతించి ఆయన మహానుభావుడని కొనియాడుతున్నారు. చిడతలు మాత్రం చేతిలో లేవు గాని బీభత్సంగా భజన చేస్తున్నారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభరెడ్డిని భజన చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించదలచుకుంటున్నదో అర్థం కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వారికి ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే వ్యక్తి ఒక ముగిసిపోయిన అధ్యాయం. రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే, కనీసం ఆయన పదే పదే చెప్పుకునే కాపు జాతిలో కూడా కనీస విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు పద్మనాభరెడ్డి. కాపు జాతి కోసం తాను పోరాడుతున్నానని, ఆరాటపడుతున్నానని పదేపదే చెప్పుకొనే ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడిన అసంబద్ధమైన మాటలు.. పవన్ కళ్యాణ్ జట్టులో చేరి ఆయనకు అండగా ఉండడానికి ప్రయత్నాలు సాగించి అవి విఫలం కావడంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరి చేసిన దుందుడుకు విమర్శలు.. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, కాపు జాతి మరచిపోలేదు. ప్రత్యేకించి సొంత కూతురు జనసేనలో చేరడానికి ప్రయత్నించినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా హుందాగా రెస్పాండ్ అయితే- దానికి కౌంటర్ గా ముద్రగడ పద్మనాభం ఎంత లేకిగా మాట్లాడారో రాష్ట్రం గమనించింది ఇలాంటి చర్యల వల్లనే ఆయన మాటకు విలువ లేకుండా పోగా, ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్పించుకోవలసి వచ్చింది.
ఎన్నికలకు ముందు తాను రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ కాపులను సమీకరించి వైయస్సార్ కాంగ్రెస్ ను గెలిపిస్తానని హామీ ఇచ్చి ముద్రగడ ఆ పార్టీలో చేరారు. కానీ, తన పార్టీలో తాను తప్ప రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయగల మనిషి మరొకరు ఉండకూడదని మోనార్క్ వైఖరిని అవలంబించే జగన్మోహన్ రెడ్డి ముద్రగడను పార్టీలో చేర్చుకున్నారు గాని జస్ట్ ఇంటికి పరిమితం చేశారు. ఆయన తనంతగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించే బాధ్యత నెత్తికెత్తుకున్నప్పటికీ విఫలమయ్యారు.
ఇప్పుడు పార్టీలో ఉన్న కాపులు ప్రజాదరణ ఉన్నవారు కాదు అనే నమ్మకంతో ముద్రగడను కాస్త మెయిన్ ట్రాక్ మీదికి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. అందుకే అంబటి రాంబాబును జగన్ కిర్లంపూడి పంపారేమో అని పలువురు అనుకుంటున్నారు. లేదా, సత్తెనపల్లిలో తను ఓటమి తర్వాత పార్టీలో ప్రాభవం, రాజకీయ వైభవం, భవిష్యత్తు అంతర్ధానమైపోతాయని గుర్తించిన అంబటి రాంబాబు.. తాను స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి తద్వారా కాపు కుల బలం తనతో ఉన్నదని జగన్మోహన్ రెడ్డి వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం కూడా కొందరికి కలుగుతోంది. ముద్రగడ భజన చేసినంత మాత్రాన అంబటి గాని, పార్టీ గాని సాధించేదేమీ ఉండదని పలువురు అంటున్నారు.