వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇతర పార్టీలోకీ వెళ్లే అవకాశం లేని అతికొద్ది మంది నాయకుల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరు. అనగా, ఏ ఇతర పార్టీ వారు కూడా ఆ మాజీ మంత్రిని దగ్గరకు రానివ్వరు- అనే క్లారిటీ ఆయనకు ఉంది. కాబట్టి.. ఎక్కడేం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దూకుడుగా స్పందిస్తూ.. ఎడాపెడా మాట్లాడేయడానికి ఆయన ముందువరుసలోనే ఉంటారు. అలాంటి గుడివాడ అమర్నాథ్.. తాజాగా పార్టీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడం గురించి తన అమూల్యమైన అభిప్రాయం వెల్లడించారు.
నాయకుల మీద రాజకీయ పరమైన ఒత్తిడి ఉంటుందట. కొంతమంది ఆ ఒత్తిడిని తట్టుకోగలరట.. మరికొంతమందతి ఒత్తిడి తట్టుకుని నిలబడలేక వెళ్లిపోతుంటారని గుడివాడ అంటున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత.. ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. వీరందరూ ఎలాంటి ఒత్తిడితో వెళ్లిపోయారో.. గుడివాడ అమర్నాధ్ విశ్లేషిస్తే బాగుంటుంది. అందరికీ ఒకటే రకమైన ఒత్తిడి ఉన్నదా? లేదా, ఒత్తిడిలో వేర్వేరు రకాలు ఉన్నాయా? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే.. నాయకులు భయపడుతున్నారు. జగన్మోహన్ర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోతున్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ బతికి బట్టకట్టడం అసాధ్యం అనే భావనకు వస్తున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లేవారు కొందరైతే.. అసలు ఏపార్టీలోకీ వెళ్లనవసరం లేదు.. ఇక్కడితో రాజకీయ జీవితం చాలు.. జగన్ తో కలిసి ఉంటే మాత్రం.. ఇంకా పూర్తిగా మునిగిపోతాం అని పలువురు భయపడుతున్నారు. ఇవన్నీ గుడివాడకు తెలియని సంగతులు కావు. ముందే చెప్పుకున్నట్టు.. పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోలేక.. అలాగని, ఇతర పార్టీల్లో ఎంట్రీకి అవకాశం దొరక్క వైసీపీలో మిగిలిపోతున్న వారిలో ఒకరైన గుడివాడ, విజయసాయి రాజీనామా గురించి ఏదో ఒత్తిడి అంటూ తేలిగ్గా మాట్లాడ్డం తమాషాగా ఉంది.
ఇతర పార్టీల వారు.. వైసీపీ వారిని ఒత్తిడి చేసి రాజీనామా చేయిస్తున్నట్టుగా ధ్వనించడానికి గుడివాడ ప్రయత్నిస్తున్నారేమో గానీ.. 11 సీట్ల బలంతో దయనీయ స్థితిలో ఉన్న ఆ పార్టీ మీద ఎవ్వరికీ అంత ఫోకస్ ఉండదు. కానీ.. ఆ పార్టీ నాయకులకు ఒత్తిడి ఉన్నమాట నిజమే. భవిష్యత్తు లేని పార్టీలో కొనసాగుతున్నాం అనే ఒత్తిడి అది. ఈ ఒత్తిడిలో ఇంకా ఎంతమంది వెళ్లిపోతారో తెలియదు. అయితే అలాంటి నాయకుల నిష్క్రమణం క్రమంగా జగన్ మీద కూడా ఒత్తిడి పెంచుతుందని కూడా గుడివాడ అమర్నాధ్ తెలుసుకోవాలి.