పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ కలిసి రూపొందించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఇది పూర్తిగా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కింది.
ప్రారంభం నుంచే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. దీనితో పవన్ కెరీర్‌లో మొదటిసారి జాతీయ స్థాయిలో విడుదలకు సిద్ధమైన చిత్రం ఇది.
ఇక థియేటర్లలో విడుదలకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా, హిందీ వెర్షన్ విషయమై కొంత అయోమయం నెలకొంది. ఎందుకంటే ముంబై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో ఇప్పటివరకు హిందీలో టికెట్ బుకింగ్స్ మొదలయ్యే గుర్తులు కనిపించడం లేదు. సాధారణంగా ఈ ప్రాంతాల్లో ముందుగానే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో అయితే బుకింగ్స్ ఇప్పటికే మంచి వేగంతో జరుగుతున్నాయి. కానీ ఉత్తరభారతంలో హిందీ వెర్షన్ రిలీజ్‌కి సంబంధించి స్పష్టత లేకపోవడం ప్రశ్నలు తెరపైకి తెస్తోంది. హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేస్తారనే ప్రచారమే ఉన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అది వాయిదా పడినట్లా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హరిహర వీరమల్లు హిందీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షించగలడో, అసలు అక్కడ రిలీజ్ జరుగుతుందో లేదో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.