వైఎస్ఆర్ బిడ్డ కన్నీటి అభ్యర్థనకు విలువ ఎంత?

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల ఇప్పుడు ఆయన వారసురాలిగా కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించడానికి బరిలో నిలిచారు. తన తండ్రికి లక్ష్మణుడి వంటి తమ్ముడైన వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితులను పార్లమెంటుకు పంపవద్దు అంటూ ఆమె నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. చిన్నాన్నను చంపిన వారికి శిక్ష పడాలని, అందుకోసమే తాను ఎంపీగా బరిలో నిలిచానని అంటున్నారు. హంతకులను కాపాడడానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కుయుక్తులను తిప్పి కొట్టాలని పిలుపు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్సార్ షర్మిలకు స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నుంచి ప్రతిఘటనలు కూడా ఎదురవుతున్నాయి.

ఇలాంటి ఆటుపోట్లు అన్నీ హృదయాన్ని మెలిపెడుతుండగా తన స్వస్థలం పులివెందులలో పూల అంగళ్ళ సెంటర్ వద్ద బహిరంగ సభ నిర్వహించి తన చిన్నాన్న వివేకానంద రెడ్డి అత్యంత కిరాతకంగా హత్యకు గురైన సందర్భాన్ని ప్రస్తావిస్తూనే, చంపిన దుర్మార్గులను విడిచిపెట్టకూడదని కోరికను వ్యక్తం చేస్తూనే గద్దద స్వరంతో, కన్నీటితో షర్మిల తనను గెలిపించాలని అక్కడి ప్రజలను అభ్యర్థించారు. కొంగుచాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ తన చీర కొంగును చాచి ఆమె ప్రజలను వేడుకోవడం సభలో ఉన్న వారిని కదిలించింది.

వివేకానంద రెడ్డి హత్యకు గురైన తర్వాత ఆయన కుమార్తె సునీత అసలు హంతకులు ఎవరో నిగ్గు తేల్చాలంటూ కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటం సాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తొలి నుంచి ఆమె వాదనకు వైయస్ షర్మిల మద్దతు గానే నిలుస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత వివేకాను హత్య చేశారని భావిస్తున్న అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సునీతనే నిలబెట్టాలని షర్మిల తొలుత భావించారు. కానీ పార్టీ అధిష్టానం సూచనతో స్వయంగా బరిలోకి దిగి హంతకులను  గెలిపించవద్దంటూ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె సభలలో గొడవలు సృష్టించడం ద్వారా వైసిపి కార్యకర్తలు ఇప్పటికే ఇబ్బంది పెడుతూ వస్తున్నారు.

వాటన్నింటినీ తట్టుకొని ముందుకు సాగుతున్న వైఎస్ షర్మిల తన తండ్రి సుదీర్ఘ కాలంగా రాజకీయ అనుబంధాన్ని పెనవేసుకున్న స్వగ్రామం పులివెందుల పూలంగళ్లసెంటర్లో సభ నిర్వహిస్తున్న సమయంలో తన మీద జరుగుతున్న ఎదురు దాడిని తలుచుకుని ఉద్వేగానికి గురయ్యారు. కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఒక చేత్తో కొంగు చాపి, షర్మిల అభ్యర్థించారు మరి ఈ వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కన్నీటికి ఎంత విలువ ఉంటుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories