ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి. వాటికి ప్రతిగా తెలుగుదేశం వారు స్పందించి రోడ్డు మీదకు వస్తే సహజంగానే ఘర్షణలు తలెత్తుతాయి. అలాంటి సందర్భంలో మా మీద దాడులు జరిగాయి, కొట్టేస్తున్నారు.. అంటూ నానా గోల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను నశించిపోయాయని, హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరుతున్నాయని, రాష్ట్రపతి పాలన విధించి తీరాల్సిందేనని కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఒకటిన్నర నెలలు కూడా గడవకముందే రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ను బద్నాం చేయాలనే కోరికతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడానికి పూనుకున్నారు. 24వ తేదీ ముహూర్తం కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతున్నదని దేశమంతా చాటి చెబుతారట! అయితే ఈ ధర్నా సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న గౌరవ మర్యాదలు ఏమిటో.. ఆయన పట్ల దేశ ప్రజల్లో ఉన్న విశ్వాసం ఎంత మాత్రమో, బలం ఏపాటిదో సమస్తం లెక్క తేలనున్నాయి.
దేశంలోని అన్ని పార్టీలను ఢిల్లీలో తాము నిర్వహించబోయే ధర్నాకు ఆహ్వానించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి జాతీయస్థాయిలో ఏయే పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించారు గనుక ఈరోజు ఆయన పిలిస్తే వారంతా తరలిరావాలని అనుకుంటున్నారు- అనేది ప్రజల మదిలో మెదలుతున్న పెద్ద ప్రశ్న! తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోడీ మోచేతి నీళ్లు తాగుతూ పార్లమెంటులో బిల్లులు సందర్భంగా అవసరమైనప్పుడు వారికి ఉదారంగా సహకరించిన జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సమాచారం పంపితే దేశంలోని అన్ని పార్టీలు ఎగేసుకుని వచ్చేస్తాయి అనుకుంటున్నారా? ఎన్డీఏ కుటుంబంలోని పార్టీలతో గానీ, ఇటు ప్రతిపక్ష పార్టీలతో గానీ ఏనాడూ జగన్ సంబంధాలు కొనసాగించింది లేదు. వారంతట వారు వచ్చి జగన్ కోసం స్నేహం చాచినా ఆయన తిరస్కరించారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఎన్డీఏ లోని పార్టీలు ఎటు తిరిగి ఆయన వెంట కలిసి రావు. ఎందుకంటే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది కూడా కూటమి ప్రభుత్వమే. ఇలాంటి నేపథ్యంలో విపక్ష పార్టీలే వస్తే రావాలి. అయితే ఎంతమందితో జగన్కు సంబంధాలు ఉన్నాయి అనేది ప్రశ్న! పైగా ఆయన చెబుతున్న అబద్దాలను ఎంతమంది నమ్ముతారు? అనేది ఇంకో ప్రశ్న! ఈయన ఊరూరా తిరిగితే ఒక్కో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు హాయ్ అని ఆదరించి, ఒక పూట భోజనం పెట్టి వీడ్కోలు చెబుతారేమోగానీ.. తన స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి వచ్చి తన ధర్నాకు సహకరించాల్సిందిగా కోరితే ఎవరు వింటారు? అసలు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలలో జగన్మోహన్ రెడ్డికి మర్యాద, గౌరవం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? అనే విషయాలు ఈ ధర్నా సందర్భంగా 24వ తేదీ నాడు లెక్క తేలనున్నాయి!