పెద్దతలలపై వేటు వేయకుండా ఏంటి ప్రయోజనం?

అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్న ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా వేటు వేసే పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా విజయవాడ నగర కమిషనర్, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు లపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరి స్థానంలో కొత్త అధికారులు కూడా నియమితులు అయ్యారు.

కానీ ఈ పరిణామంపై కూడా విపక్షాల్లో భయాలు అసంతృప్తులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొందరు ఐపీఎస్ అధికారులు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదుల మీద ఎన్నికల సంఘం గతంలో బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు అడిగిన తరహాలోనే అప్పుడు కూడా.. ప్రతి పోస్టుకు ముగ్గురు అధికార పేర్లతో ప్యానెల్ ను సూచించాల్సిందిగా సీఎస్ ను కోరారు. ఆయన పంపిన జాబితాలో పేర్లనుంచి ఒకరిని ఎంపిక చేసి ఆ బాధ్యతల్లో ఈసీ నియమించింది. అయితే సీఎస్ సూచించిన ప్యానెల్ లోని అన్ని పేర్లు కూడా.. వైసీపీ కి అనుకూలంగా ఉండే నాయకులవే అనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. దానిపై తీవ్రదుమారం చెలరేగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాలేదు.

ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర్ కమిషనర్ గా పీహెచ్‌డీ రామక్రిష్ణ నియమితులయ్యారు. ఈ ఇద్దరికీ కూడా క్లీన్ ట్రాక్ రికార్డు ఉంది. నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించే వారుగా, ఒత్తిళ్లకు తలొగ్గని అధికారులుగా గుర్తింపు ఉంది. ఇప్పటికి మంచి అధికారులు వచ్చినట్టే.

కానీ పలు జిల్లాల్లో అదుపుతప్పుతున్న శాంతిభద్రతల పరిస్థితి, సందేహాస్పదంగా మారుతున్న ఉన్నతాధికారులు తీరు మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వీరిని మార్చడం అనే ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే.. ముందు పెద్దతలకాయలు సీఎస్, డీజీపీలను మారిస్తే తప్ప సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

తెలుగుదేశం నాయకులు ఇప్పటికే పలుమార్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి ల వ్యవహార సరళి గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ఏప్రిల్ పింఛన్ల పంపిణీలో సీఎస్ ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ ఆదేశాల మేరకు జాప్యం చేయడం వల్లనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని కూడా తెలుగుదేశం ఆరోపించింది. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం విధులు నిర్వర్తించడం అంతా సవ్యంగా ఉండాలంటే.. ముందు డీజీపీ, సీఎస్ లను మార్చాల్సిన అవసరం ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories