ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి రంగానికీ విస్తరించిన సాంకేతిక శక్తి అని చెప్పాలి. కానీ దీని ఉపయోగం ఎంత మంచిదో, దుర్వినియోగం కూడా అంతే ప్రమాదకరం అవుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో లేదా పబ్లిక్ ఫిగర్స్ విషయంలో ఇది మరింత సమస్యగా మారింది. తాజాగా ఓజీ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ దీనికి బలయ్యింది.
ఇటీవల ఆమె పేరుతో కొన్ని అనుచితమైన, తప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన కొంతమంది అవి నిజమేనని నమ్మి పంచుకోవడం ప్రారంభించారు. కానీ ఈ విషయంపై ప్రియాంక స్వయంగా స్పందించింది. తనపై ప్రచారంలో ఉన్న చిత్రాలు పూర్తిగా నకిలీవని, అవి AI సాంకేతికతతో సృష్టించబడినవని స్పష్టం చేసింది. అటువంటి తప్పుడు కంటెంట్‌ను ఎవరూ నమ్మకూడదని, పంచకూడదని ఆమె కోరింది.
అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సృజనాత్మకమైన, న్యాయబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి కానీ వ్యక్తులను అవమానించేలా లేదా తప్పుడు ప్రచారం కోసం కాదు అని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ స్పందన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.