పెద్దిరెడ్డి కుట్రలతో చిత్తూరు జిల్లాలో లాస్ ఎంత?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకుల్లో ఒకరు. ఆ పార్టీలో జగన్ కంటె బలమైన, జగన్ ను కూడా శాసించగల నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పెద్దిరెడ్డే అని పలువురు చెబుతుంటారు. అలాంటి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలను తన కనుసన్నల్లో శాసిస్తుంటారు. అయితే ఆయన పార్టీ గెలవాలనే లక్ష్యంతో కాకుండా.. చిత్తూరు జిల్లాలో తన ఆధిపత్యం శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారనేది తాజా గుసగుస. పెద్దిరెడ్డి దెబ్బకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ గణనీయంగానే స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కుప్పం మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవశం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కనీసం సగమైనా నిలబెట్టుకోగలుగుతుందా అనే అనుమానాలు, భయాలు ఆ పార్టీలోనే ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు సంగతి సరే సరి, మదనపల్లెలో షాజహాన్, పలమనేరులో అమర్ నాధ్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారనే అభిప్రాయం జనంలో ఉంది. అలాగని మిగిలిన స్థానాలన్నీ వైసీపీ గెలుస్తుందని కాదు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. తిరుపతి, చంద్రగిరి కూడా సానుకూలత ఉందని అంటున్నారు. కానీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. జిల్లాలో తన హవాకు అడ్డులేకుండా ఉండేందుకు పలువురు సొంత పార్టీ నాయకులను ఓడించేందుకు తెరవెనుక తన వర్గాన్ని పనిచేయిస్తున్నట్టు సమాచారం.

చిత్తూరులో ఆర్టీసీ పదవిలో ఉన్న విజయానంద్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. అయితే ఆయనకు ఇవ్వడం పెద్దిరెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికీ.. చెవిరెడ్డి ప్రాపకం ద్వారా విజయానంద్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు.

ఆయన పట్ల పెద్దిరెడ్డికి కినుక ఉంది. అలాగే గంగాధర నెల్లూరు లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పోటీచేస్తోంది. ఈమె కూడా పెద్దిరెడ్డి ఇష్టంతో నిమిత్తం లేకుండి టికెట్ తెచ్చుకున్నదనే పేరుంది. ఇక నగరి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ కె రోజా ను ఓడించడానికి పెద్దిరెడ్డి వర్గం మొత్తం తమ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఆమె మంత్రిగా ఉండగా కూడా.. పెద్దిరెడ్ది వర్తం నియోజకవర్గంలో ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం సుధీర్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డి వర్గం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. బొజ్జల కుటుంబంతో ఉండే బంధుత్వం కారణంగా.. ఆ నియోజకవర్గంలోని తన వర్గం నాయకులందరినీ సుధీర్ కు అనుకూలంగా పనిచేయాలని పెద్దిరెడ్డి సూచించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ పరిగణించి చూస్తే.. కేవలం పెద్దిరెడ్డి కారణంగా.. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం నాలుగు నియోజకవర్గాల్లో దెబ్బ తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories