చింత చచ్చినా పులుపు చావలేదని సామెత. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల ధోరణి కూడా అలాగే కనిపిస్తోంది. ఆ పార్టీని ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ పార్టీకి జరగనంత దారుణంగా అవమానకరంగా అత్యంత ఘోరంగా ఓడించి.. 11 సీట్లకు పరిమితం చేశారు. అంతమాత్రమే కాదు.. అధికారంతో కనులుమూసుకుపోయి ప్రవర్తించిన రోజుల్లో చేసిన పాపాలకు వారు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది జైళ్లలో ఉన్నారు.. కొందరు జైళ్లకు వెళ్లి బెయిలుపై బయట ఉన్నారు.. మరి కొందరు బెయిలుకోసం నిరీక్షిస్తూ జైలుకు వెళ్లే మార్గంలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా గానీ.. గతంలో చంద్రబాబునాయుడు నివాసం మీద దాడి, విధ్వంసం చేసిన కేసులో ఇప్పటికి మూడుసార్లు విచారణను ఎదుర్కొన్న జోగి రమేష్ వంటి వారికి అహంకారం మాత్రం తగ్గడం లేదు.
తాము ఎంతటి మేకపోతు గాంభీర్యంతో మాట్లాడితే.. అంతగా నిర్దోషులం అని ప్రజలను మభ్యపెట్టవచ్చు అని అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ.. ఆయన మూడోసారి సీఐడీ విచారణకు హాజరైన తరువాత.. మీడియా ముందు చాలా దబాయించి మాట్లాడుతున్నారు. ‘ఇవన్నీ ఎప్పటి కేసులు.. ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు’ అంటూ జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నోటీసుల ద్వారా తమను ఏమీ చేయలేరని, మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల ద్వారా పోలీసులు ఏమైనా చేయగలరా? లేదా? అనేది వ్యవహారం కోర్టు వరకు వెళ్లిన తర్వాత.. నిదానంగా తేలుతుంది. మరో సంగతి ఏంటంటే.. ఈ కేసులకు మళ్లీ అధికారంలోకి రావడానికి సంబంధం లేదు. ఈ రెండు అంశాల కంటె ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘ఇవన్నీ ఎప్పటి కేసులు? ఎప్పుడు కేసులు పెడుతున్నారు’ అంటూ జోగి ప్రశ్నించడంలో లాజిక్ అర్థం కావడం లేదు.
ఒక తప్పు జరిగితే.. కొంతకాలం గడిచిన తర్వాత.. అసలు ఆ తప్పుగురించి కేసులే పెట్టకూడదా అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. జోగి రమేష్.. కేసులు ఎంత పాతవి అనే సంగతిని ప్రశ్నించడం కాదు.. ధైర్యముంటే అసలు కేసులో ఉన్న నేరం జరిగిందా? లేదా? అనే సంగతి మాట్లాడాలి. ఆ విషయంలో మాత్రం ఆయన మూడోసారి విచారణలో కూడా డొంకతిరుగుడు సమాధానాలే చెబుతున్నారు. అప్పట్లో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలకు నిరసన తెలియజేయడానికి మాత్రమే చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లాను అని.. దాడి చేయడానికి కాదని ఆయన అంటున్నారు. నిరసనకు వెళ్లిన వాళ్లు కారులో కర్రలు, రాళ్లు ఎందుకు పెట్టుకు వెళ్లారని అడిగితే.. సమాధానం దాటవేస్తున్నారు.
సుప్రీం కోర్టు దాకా వెళ్లి ముందస్తుగా బెయిలు తెచ్చుకోవడం వల్లనే.. జోగి రమేష్ ఇంత దూకుడుగా మాట్లాడుతున్నారా? లేదా, దబాయించి మాట్లాడితే.. తాను తప్పు చేయలేదని అంతా నమ్ముతారనే భ్రమలో ఉన్నారా? అని ప్రజలు అనుకుంటున్నారు.