ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చినందుకు తనలోని అత్యాశాను కొండంతలుగా ప్రదర్శించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని దుర్బుద్ధికి నిదర్శనం విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ లు. వైఎస్ జగన్ తనకు, తన కూతుళ్లకు తగినట్టుగా మూడు నివాసాలు, తన క్యాంపు కార్యాలయం అన్నట్టుగా ఆఫీసు మరియు సమావేశ భవనాలు ఇక్కడ నిర్మించుకున్నారు. అయిదేళ్ల పదవీకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఇటుక పెట్టి ఒక్క నిర్మాణం కూడా చేయకపోయినప్పటికీ.. ఏకంగా 430 కోట్ల రూపాయలు తాను కలగన్న భవనాల కోసం ఆయన టూరిజం శాఖ ద్వారా ఖర్చు పెట్టించారు. ఏడాదికి 70 కోట్ల ఆదాయం సమకూరుస్తున్న టూరిజం అతిథిభవనాలను కూల్పించి.. ఏడాదికి కోటిన్నర విద్యుత్తు బిల్లుల భారంగా మారిన భవనాలను ఆయన నిర్మింపజేశారు. సదరు రుషికొండ ప్యాలెస్ లను ఏరకంగా వినియోగించుకోవాలా అని ప్రభుత్వం ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటుచేసి అధ్యయనం చేయిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన సీనియర్ నాయకుడు ప్రస్తుతం గోవా గవర్నరుగా ఉన్న పూసపాటి అశోక్ గజపతి రాజు ఒక సలహా ఇస్తున్నారు. రుషికొండ భవనాలను మానసిక వైకల్యంగల వారికోసం ఉన్నత ప్రమాణాలు గల ఆస్పత్రిగా మార్చాలని ఆయన అంటున్నారు. గోవా గవర్నరు అయిన తర్వాత.. విశాఖపట్నంలో క్షత్రియ సామాజిక వర్గం వారు ఏర్పాటుచరేసిన సత్కార కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గజపతి.. ఆ ప్యాలెస్ లను నిర్మించడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని దుర్బుద్ధులను ఎండగట్టారు.
నేనుచాలా కాలం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని అంటూ.. అప్పట్లో సంక్షేమం కోసం ప్రభుత్వాలు అప్పులు చేసేవని, కానీ.. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నీ తాకట్టులో పెట్టడం చూశామని ఆయన ఎద్దేవా చేశారు. రుషికొండ ప్యాలెస్ ప్రారంభం కాకముందే అప్పుడే పెచ్చులు ఊడిపోతుండడాన్ని కూడా ఆయన ఎత్తిచూపారు. దానిని కట్టిన దుర్మార్గులకు ఆ సముద్ర గాలి తగులుతుందని కూడా శపించారు. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయమూ ప్భుత్వానికి రాదని అంటూ.. ప్రజాధనాన్ని ప్రజాహితం కోసం వాడకుండా.. తన స్వార్థం కోసం జగన్ ఖర్చు పెట్టించారని అన్నారు.
నిజానికి రుషికొండ ప్యాలెస్ ను ఏరకంగా వినియోగించుకోవాలో తేల్చడానికి ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటుచేసింది. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించి మంత్రులు, ప్రజల నుంచి కూడా రకరకాల సలహాలు వస్తున్నాయి. అయితే అశోక్ గజపతి రాజు.. దానిని పిచ్చి ఆస్పత్రిగా మార్చాలని అనడం.. కొత్త ఆలోచనలను కూడా కలిగిస్తోంది.