గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి.. జగన్మోహన్ రెడ్డి తీరుతో విసిగిపోయి ఆ పార్టీకి దూరంగా ఉండిపోయిన నాయకుడు రఘురామక్రిష్ణ రాజు. గెలిచిన తర్వాత కొన్ని నెలలైనా గడవకముందే.. జగన్ తో విభేదించిన రఘురామ అప్పటినుంచి ఆ పార్టీ మీద తనదైన రీతిలో విరుచుకుపడుతూనే వచ్చారు. పార్టీ మారకుండా, వైసీపీని వీడకుండా, తన మీద అనర్హత పిటిషన్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా.. ఒకవైపు తమ పార్టీ అధినేత జగన్ చాలా గొప్పవాడని కితాబులు ఇస్తూ.. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గుడు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తూ.. జగన్ ను నిర్మొగమాటంగా, నిర్భయంగా ఈ అయిదేళ్లపాటు ఎండగట్టడంలో రఘురామక్రిష్ణరాజు తనదైన ముద్ర చూపించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను పెద్దస్థాయిలోనే టార్గెట్ చేసింది. సీఐడీ పోలీసులు ఆయనను ఒక కేసులో అరెస్టు చేశారు. ఎంపీగా ఉన్న తనను మొహాలకు మాస్కులు తగిలించుకున్న పోలీసులు దారుణంగా కొట్టారంటూ ఆయన న్యాయమూర్తికి చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన జగన్ ను టార్గెట్ చేయడం మానలేదు. సొంత యూట్యూబ్ చానెల్ కూడా పెట్టుకుని, రచ్చబండ అని ఓ కార్యక్రమం కూడా పెట్టుకుని.. ముఖ్యమంత్రి జగన్ పాలన మీద విమర్శలతో ఉతికి ఆరేయడమే పనిగా ఆయన అయిదేళ్లపాటు పోరాడారు. ఎంపీగా ఢిల్లీలో ఉంటున్నారు గనుక.. భారతీయ జనతా పార్టీ పెద్దలతో చాలా క్లోజ్ గా మెలగుతూ, అనేక మంది కేంద్రమంత్రులతోనూ సత్సంబంధాలు నెరిపారు. పవన్ కల్యాణ్ తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబును కూడా చాలా తరచుగా పొగుడుతూ వచ్చారు.
ఎన్నికల సీజను వచ్చేసరికి.. గత ఎన్నికల్లో తాను గెలిచిన నరసాపురం నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీచేయాలని ఆయనకు అనిపించింది. ఏ పార్టీలూ టికెట్ల ఊసు ప్రారంభించకముందే.. తొందరపడిన ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా.. ఆయన మాత్రం.. తాను నరసాపురం నుంచి ఎంపీగా బరిలో పోటీచేయబోతున్నానని, ఏ పార్టీ తరఫున అనేది తర్వాత చెబుతానని అన్నారు. మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడం కూడా గ్యారంటీ అని ఆయన అందరికంటె ముందే అన్నారు. ఆయన వైసీపీ తప్ప అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలతో ఉన్నారు గనుక.. నరసాపురం సీటు ఎవరికి దక్కినా సీటు మాత్రం రఘురామకే అనే అంతా అనుకున్నారు కూడా. కానీ.. బిజెపి సీట్ల జాబితా ప్రకటించేసరికి.. నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ పేరును ప్రకటించారు. ఇప్పుడు రఘురామ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. రఘురామక్రిష్ణ రాజు రాష్ట్రమంతా తిరుగుతూ ఎన్డీయే కూటమి అనుకూల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది. జగన్ ఓటమికి కంకణం కట్టుకున్న రఘురామక్రిష్ణ రాజు.. తనకు టికెట్ దక్కలేదనే పరాభవాన్ని దిగమింగి.. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఎంతమేర చురుగ్గా వ్యవహరిస్తారో చూడాలి.