ఆ విషయంలో జగన్ స్కెచ్ ఏమిటో?

తనను, తన పార్టీని కాదనుకుని వెళ్లిపోయే వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఖచ్చితంగా ఉంటారు. వెళ్లిపోయే వారిని బతిమాలడం, పార్టీ వీడిపోవద్దని అడగడం జగన్ వద్ద చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. కనీసం వెళ్లిపోయే వారు, ఎందుకు వెళ్లిపోతున్నారో తెలుసుకుని, అదే కారణాలవల్ల ఇంకా ఎవరైనా వెళ్లిపోకుండా పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన కూడా జగన్ వ్యవహార సరళిలో ఉండదు. అయితే పార్టీని వద్దని అనుకున్న ఎమ్మెల్సీల విషయంలో ఆయన వైఖరి, ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీకలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి మండలి ఛైర్మన్ కు సమర్పించారు. మండలి ఛైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే. అయినాసరే, వారి రాజీనామాలు మాత్రం ఇంకా ఆమోదం పొందలేదు. వారిని మాజీలు చేయకుండా కొనసాగించడంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటో అర్థం కావడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ కు 36 మంది సభ్యుల బలం ఉంది. అధికార ఎన్డీయే కూటమికి ఉన్న బలం 10 మాత్రమే. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత పలువురు ఎమ్మెల్సీలు ఎన్డీయే కూటమిలో చేరడానికి ఉత్సాహపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీ మెజారిటీకి మొత్తంగా గండిపడే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఆ పార్టీ నుంచి రాజీనామా చేశారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ముగ్గురూ పదవులకు రాజీనామాలు చేసేసి.. మాజీలు కావడం కోసం నిరీక్షిస్తున్నారు. వారాలు నెలలు గడుస్తున్నప్పటికీ వీటిని మండలి ఛైర్మన్ మోషన్ రాజు ఇప్పటిదాకా ఆమోదించనేలేదు. కనీసం వారిని పిలిచి వివరణ తీసుకోవడం కూడా జరగలేదు. మోషేన్ రాజు, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచనను అనుసరించి నిర్ణయం తీసుకుంటారని అనుకోవచ్చు. అయితే, ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదిస్తూ పోతే.. మండలిలో కూడా తమ పార్టీ టెక్నికల్ గా మైనారిటీలో పడుతుందని జగన్ భయపడుతున్నారా? అనేది పలువురి సందేహంగా ఉంది. మండలి ఎదుటకు బిల్లులు వచ్చినప్పుడు వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ సాంకేతికంగా వైసీపీ సభ్యులుగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో జగన్ ఉన్నారా? అనేది తేలడం లేదు. ఇంత రాజీపడిన నిర్ణయం అసలు జగన్ ఎందుకు తీసుకున్నారనేది ఆ పార్టీ వారికే బోధపడడం లేదు. వెళ్లిపోయే వారిని పోనివ్వండి అని చెప్పే జగన్, ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించేలా మోషేన్ రాజుకు ఎందుకు చెప్పడం లేదో మరి.

Related Posts

Comments

spot_img

Recent Stories