జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత పబ్లిసిటీ పిచ్చి బహుశా మరెవ్వరికీ ఉండకపోవచ్చు. సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు మరొకరిని మనం చూడలేం. ఎయిర్పోర్ట్ వంటి ప్రదేశాల నుంచి, గుడినుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ జనం ఎవ్వరూ లేకపోయినా సరే.. కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయి గనుక.. ఏదో జనానికి అభివాదం చేస్తున్నట్టుగా చేయి ఊపి బిల్డప్ ఇస్తూ సాగే మనిషి ఆయన. అలాంటి వ్యక్తి.. రషీద్ ను పరామర్శించడానికి వెళితే మాత్రం.. పబ్లిసిటీ యాంగిల్ ను ఎందుకు మిస్సవుతారు. నిజానికి జగన్ కు కావాల్సింది రషీద్ ను పరామర్శించడం కాదు.. వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం కాదు. ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా.. తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద చల్లడం, అలాగే తనకు మరింత పబ్లిసిటీ వచ్చేలా చూసుకోవడం మాత్రమే.
జగన్మోహన్ రెడ్డి వినుకొండ యాత్ర పెట్టుకోవడం ద్వారా అనుసరించిన మొదటి పబ్లిసిటీ ఎత్తుగడ ప్రభుత్వం ఇచ్చిన కారును వదిలేసి, సొంత కారు ఎక్కడం! రోడ్డు మీద ఆరకంగా ఆయన చిన్న హైడ్రామా నడిపించారు. ఒక కారుతో అసహనానికి గురై దిగేయడం.. వర్షం.. ఆయనకు అందరూ గొడుగులు పట్టడం.. మరోకారు ఎక్కడం ఇదంతా ఒక ప్రహసనంలాగా నడిచింది. ఆ తర్వాత కూడా ఆయన రషీద్ ఇంటికి నేరుగా వెళ్లలేదు.
ఆ దారిలో ఉండే అన్ని గ్రామాలు ఊర్లలో పార్టీ వారిని ముందే పురమాయించారు. వారు జనాన్ని పోగేసి రోడ్డు పక్కన నిల్చోబెట్టారు. ప్రతిచోటా జగన్ కారు ఆపి ప్రజలకు అభివాదం చేస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు. ఈ డ్రామాలన్నీ అయ్యేసరికి చాలా ఆలస్యం అయింది.
తాడేపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరారు. వినుకొండలోని రషీద్ ఇంటికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవాలన్నది జగన్ ముందుగా ప్రకటించిన షెడ్యూలు కాగా.. సాయంత్రం 5 గంటలకు అక్కడకు వచ్చారు. జగన్ రావడం అనేది ఒక పండగ లాగా వైసీపీ వాళ్లు కొబ్బరి కాయలు కొట్టడం, బాణసంచా కాల్చడం వంటి అతివేషాలు వేయడంతో ఇంకా ఆలస్యం అయింది. ట్రాఫిక్ కూడా స్తంభించింది.
మీకు కావాల్సిన వాళ్లు మరణిస్తే.. పరామర్శకు మీరు వెళితే.. దారి పొడవునా ఇలా హడావుడి చేస్తూ వెళతారా లేదా.. ఆ షాక్ లో, బాధలో వెళ్లి వారిని పలకరించి వస్తారా? ఒకసారి గుర్తుచేసుకోండి. జగన్ ఎంతటి పబ్లిసిటీ పిచ్చితో అలమటిస్తున్నాడో.. రషీద్ చావును తన పబ్లిసిటీకోసం, రాజకీయ స్వార్థం కోసం ఎంతగా వాడుకోవాలనుకుంటున్నాడో అర్థమవుతుంది.