పరిపూర్ణానంద అనే పేరుతో ఒక కాషాయంబరధారి స్వామీజీగా చలామణి అవుతూ ఉంటారు. తాను కాషాయం ధరిస్తాను కనుక భారతీయ జనతా పార్టీతో మొన్న మొన్నటిదాకా అంట కాగుతూ, తిరుగుతూ ఉండేవారు. కాషాయం ధరించిన వాళ్ళకి రాజకీయాలలో కూడా పెద్దపీట వేసే అలవాటున్న భారతీయ జనతా పార్టీ.. 2014 ఎన్నికల సమయంలో తెలంగాణకు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మరీ ఎన్నికలకు వెళ్ళింది. ఆ ఎన్నికలలో బిజెపి ఘోరంగా ఓడిపోయింది.
అప్పటినుంచి ఈ పరిపూర్ణానంద కూడా రాజకీయంగా తెరవెనుకకు వెళ్లారు. ఇప్పుడు 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలవబోతున్నదనే అభిప్రాయం ప్రజల్లోకి వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత హఠాత్తుగా ఆయన మళ్ళీ తెరమీదకు వచ్చారు. బిజెపి తరఫున తనకు అనంతపురం జిల్లాలోని హిందూపురం టికెట్ కావాలంటూ పట్టుపట్టారు. అది తెలుగుదేశానికి సిట్టింగ్ సీటు కావడం మాత్రమే కాకుండా, నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా సరే తనకు అదే సీటు కావాలంటూ పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ ను కూటమి కాదు కదా.. కనీసం బిజెపి కూడా గురించి పట్టించుకోలేదు.
అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని అలిగిన పరిపూర్ణానంద ఆ నియోజకవర్గానికి వెళ్లే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నందమూరి బాలకృష్ణ ను ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ ప్రతిజ్ఞ ఎక్కడ మంట కలిసిపోయిందో తెలియదు గానీ.. అప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి భజన చేయడం ప్రారంభించారు. సరిగ్గా కౌంటింగ్ జరగడానికి ఒకరోజు ముందు మీడియా ముందుకు వచ్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రాబోతున్నదని ఈ కాషాయ సన్యాసి జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 159 ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ 129 కి ఒక సీటు కూడా తగ్గదని ఆయన అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా సంస్థ చెప్పిన ఫలితాలు కంటే జగన్కు ఎక్కువ దొరుకుతాయని కూడా ఆయన కితాబు ఇచ్చారు.
ఇంతా చేస్తే ఫలితం ఏమైందో ప్రజలందరికీ తెలుసు. కాషాయాన్ని నమ్ముకున్న ఈ ఆధ్యాత్మిక స్వామి.. ఇలా ఒళ్లంతా రాజకీయాల పులుముకుని జగన్ భజనకు ఎందుకు దిగారు? ఇలాంటి పతనం ద్వారా ఆయన ఏం సాధించారు? ఆయనకు పిచ్చెక్కి ఇలా మాట్లాడుతున్నారా ఏమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు!!