ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ తయారవుతోంది అనే వార్తలపై గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చర్చ కొనసాగుతోంది. బన్నీ ఈ సినిమాలో మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నాడని, కొంతవరకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉండొచ్చని పలు ఊహాగానాలు వినిపించాయి.
ఈ గాసిప్స్ మధ్యలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది. అట్లీ ఈ సినిమాలో ప్రత్యేక గెస్ట్ పాత్రల కోసం కసరత్తు చేస్తున్నాడట. గతంలో జైలర్ సినిమాలో రజినీకాంత్‌తో కలిసి మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్‌లు చిన్న పాత్రల్లోకి వచ్చి దుమ్ము రేపిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే తరహాలో అల్లు అర్జున్ సినిమాలో కూడా ఇద్దరు స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో కనిపించేలా అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఈ గెస్ట్ రోల్స్ కోసం ఎవరు సెలెక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాటల ప్రకారం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ సినిమా కోసం ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడట. మరోవైపు బన్నీ పాత్ర కోసం అట్లీ ఇప్పటికే పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశాడని సమాచారం. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఉండబోతోందట. అల్లు అర్జున్ ఓ డాన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్.
ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను సన్ పిక్చర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాక, షూటింగ్‌ను మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అంతే కాదు, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తిరిగి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది.