బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి అక్కడి పోలీసులు మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించగా మొత్తం అందరికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు ప్రకటించారు. హైదరాబాదుకు చెందిన తెలుగు సినీ నటి కి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు చెప్పారు. ఆ నటి చిన్న పాత్రలు పోషించే హేమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రేవ్ పార్టీ వలన ఎక్కువగా భ్రష్టు పట్టిపోయింది ఎవరా అని ఆలోచిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ కు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తరువాత హేమ పేరే మనకు గుర్తుకు వస్తుంది. కానీ ప్రజలకు అర్థమయినంత మేరకు.. హేమ చేజేతులా ఓవరాక్షన్ చేసినందు వల్లనే ఇంతగా బ్రష్టు పట్టినట్టుగా అంతా భావిస్తున్నారు.
బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో.. వారి అదుపులో ఉన్న సినీనటి హేమ.. కాస్త పక్కకు వెళ్లి ఒక వీడియో తయారు చేసి తాను హైదరాబాదులోనే ఉన్నట్లుగా ప్రజలను భ్రమింప చేస్తూ దానిని మీడియాకు విడుదల చేశారు. ప్రజలనిలా తప్పు దోవ పట్టించిన హేమ వ్యవహారం బెంగుళూరు పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఆమె తమ అదుపులోనే ఉన్నట్లుగా వారు ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చింది. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అక్కడితోనే ఆమె పరువు సగం పోయింది.
ఇలా పోలీసులకు చిక్కిన తర్వాత కూడా ఒక వీడియో విడుదల చేయడం అనే ఓవరాక్షన్ ద్వారా హేమ ఏం సాధించినట్లు? ఆమె పేరు మాత్రమే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు బెంగళూరులో పోలీసులు అదుపులో ఉంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో వంటలు వీడియో ఒకటి పోస్ట్ చేయించడం ఆమె అనుసరించిన మరొక ఎత్తుగడ. దీని వలన కూడా ఆమెకి ఎలాంటి మైలేజీ రాలేదు. సోషల్ మీడియాలో ఆమె వ్యవహారం బాగా ట్రోలింగ్ అయింది.
తీరా హేమ కు కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తేల్చేయడం విశేషం. సోషల్ మీడియాలో సినీనటి హేమ విపరీతంగా ట్రోలింగుకు గురవుతోంది. తాను హైదరాబాదులోనే ఉన్నానంటూ మభ్య పెట్టే వీడియో బయటకు రాకుండా ఉంటే గనుక.. హేమ గురించి ఇంత ఘాటైన చర్చ జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాయ చేసే అబద్ధపు ప్రకటన వలన ఆమెకు నష్టమే ఎక్కువ జరిగిందని అందరూ అంటున్నారు. పోలీసులకు దొరకగానే సైలెంట్ గా ఉంటే సరిపోయే దానికి.. ఆమె తనను తాను బజారుకీడ్చుకున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.