వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన సాగిన ఐదేళ్ల పదవీకాలంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా ఎవరి స్థాయిలో వారు.. ఎవరికి చేతనైనంత మేర వారు రెచ్చిపోయి తప్పుడు పనులతో చెలరేగిన సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్కొక్కరి పాపాలను లెక్క తీసే పనిలో పడింది. వివిధ వ్యవహారాలలో అక్రమాలు చేసిన అనేకమంది కేసుల రూపేణా విచారణ ఎదుర్కొంటున్నారు. కొందరు రిమాండ్ లో జైల్లో ఉన్నారు. మరికొందరు ఇంకా పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ కాలంలో ఐఅండ్‌పీఆర్ కమిషనర్ గా ఉంటూ ప్రభుత్వాధినేత సొంత మీడియా సంస్థ అయిన సాక్షి దినపత్రిక, టీవీ ఛానల్ లకు ప్రకటనల రూపంలో ప్రభుత్వ సొమ్మును అడ్డగోలుగా దోచిపెట్టిన విజయ్ కుమార్ రెడ్డి తాజాగా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే రకరకాల కేసులలో విచారణలు ఎదుర్కొంటున్న అనేకమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరహాలోనే ఆయన కూడా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ స్పష్టమైన జవాబులు ఇవ్వకుండా అన్ని ప్రశ్నలను దాటవేయడం గమనించాల్సిన సంగతి. ఆ మాటకొస్తే ఇలాంటి డొంక తిరుగుడు జవాబులు ఇవ్వడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ తలదన్నేలాగా విజయకుమార్ రెడ్డి తయారయ్యా రనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయనను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించిన పోలీస్ అధికారులు కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం రాబట్ట లేకపోయారు. మూడో తేదీ మళ్లీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇచ్చారు.
‘పోలీసులు ఏం అడిగినా సరే దానికి స్పష్టమైన జవాబు చెప్పకూడదు’ అని విజయ్ కుమార్ రెడ్డి ముందే మానసికంగా సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఉదయం 10.40 నుంచి రాత్రి 7.20 వరకు విచారించినప్పటికీ.. ఒక్క ప్రశ్నకు కూడా ఆయననుంచి జవాబులు రాలేదు. అన్నింటికీ తెలియదు, గుర్తులేదనేది లేదా మౌనం మాత్రమే జవాబులు అయ్యాయి.
ఇంతకూ అధికారులు అడిగినది ఇబ్బందికరమైన ప్రశ్నలు కూడా కాదు. కేంద్ర సర్వీసులో ఉన్న మీరు ఏపీకి డిప్యుటేషన్ పై ఎలా వచ్చారు? ఇక్కడికి రావడానికి సహకరించిన ముఖ్యవ్యక్తులు ఎవరు? వారితో మీకు సంబంధాలేంటి? వైకాపా హయాంలో ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడానికి అనుసరించిన విధానమేంటి? సర్కులేషన్ నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి ప్రకటనలు ఇవ్వడానికి మీపై ఎవరినుంచి అయినా ఒత్తిడి ఉందా? ఒత్తిడి తెచ్చిన వారెవ్వరు? నిబంధనలు అతిక్రమించి ప్రకటనలు ఇస్తే ప్రభుత్వ ఖజానాకు నష్టం కదా? వాటికి మీరు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయా? లాంటి ప్రశ్నలు మాత్రమే అడిగారు. ఏ ఒక్కదానికీ జవాబు ఇవ్వకుండా విజయకుమార్ రెడ్డి దాటవేసినట్టు సమాచారం. వాస్తవాలు రాబట్టడానికి రెండో రోజు కూడా విచారణకు రావాల్సిందిగా అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఆయన నోరు విప్పుతారో లేదో చూడాలి.