‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఎలాంటి తప్పిదాలు అయితే చేశారో అవే తప్పులు మనం కూడా చేయడానికి వీల్లేదు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఘర్షణలకు దిగేలాగా, తెలుగుదేశం కార్యకర్తలు హింసాత్మక సంఘటనలకు పాల్పడితే వారి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మన పార్టీ వారి మీద తప్పుడు కేసులు పెట్టారనే ఆవేదన అందరిలోనూ ఉన్నది కానీ, దానికి బదులు తీర్చుకోవాలి అన్నట్లుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు- అని చంద్రబాబు హితోపదేశం చేశారు. రాష్ట్రంలో నిజంగా శాంతిభద్రతలు కాపాడాలని కోరుకునే నాయకుడు వ్యవహరించాల్సిన తీరు ఇదే అని ఇప్పుడు ప్రజలు అంటున్నారు. తమ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు దిగవద్దని ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాటైనా చెప్పారా అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వినవస్తోంది.
రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరుగుతాయా? ఎక్కడ ఘర్షణలు చెలరేగుతాయా? ఆస్తులపై దాడులు జరుగుతాయా? అని జగన్మోహన్ రెడ్డి ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే చిన్న సంఘటనలు జరిగినా సరే ఆయన స్పందిస్తున్న తీరు- తిమ్మిని బమ్మిని చేసేలా, వాటిని గోరంతలు కొండంతలుగా ప్రొజెక్టు చేస్తున్న శైలి ప్రజలకు కంపరం పుట్టిస్తున్నది. జగన్ నిజంగానే రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అయితే చంద్రబాబు తరహాలో తమ పార్టీ శ్రేణులు గీత దాటకుండా నియంత్రణలో ఉండాలని కనీసం ఒక్క మాట అయినా చెప్పాలి కదా అని ప్రజలు కోరుకుంటున్నారు.
ఒకచోట ఒక దుర్ఘటన జరిగిందంటే చాలు.. జగన్మోహన్ రెడ్డి రెండో ఆలోచన చేయడం లేదు. వెంటనే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఉపక్రమిస్తున్నారు. తెలుగుదేశం వారు వచ్చి తమ పార్టీ మీద దాడులు చేశారని, కొట్టారని గోలగోల చేస్తున్నారు. అసలు తన మాటలలో కనీస ఇంగితం ఉన్నదా లేదా ఆయన పట్టించుకోవడం లేదు. రెచ్చిపోయి నిందలు వేయడం ఒక్కటే వైఖరిగా కనిపిస్తోంది.
జాగ్రత్తగా గమనిస్తే ప్రజల నిరసనలకు, అవి అదుపుతప్పి ఘర్షణలుగా మారడానికి మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. ఆ సున్నితమైన వ్యత్యాసాన్ని ప్రతిచోటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెరిపివేస్తున్నారు. పుంగనూరు ఘటన గురించి జగన్మోహన్ రెడ్డి ఇంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గానీ, అక్కడ తొలుత రాళ్లు విసిరి తెలుగుదేశం వారిని రెచ్చగొట్టింది వైసీపీ కార్యకర్తలే అని అందరూ చెబుతున్నారు. ఇలాంటి విషయాలను అంగీకరించడానికి జగన్ కు మనసు రాకపోవచ్చు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజల అమాయకులు కాదు గనుకనే, ఇంటింటికి డబ్బులు పంచానని జగన్ పదేపదే డప్పు కొట్టుకున్నప్పటికీ, వారు తమదైన శైలిలో తిరస్కరించి జగను కేవలం ఎమ్మెల్యేగా ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ప్రజల కళ్ళుగప్పి వాస్తవాలను వక్రీకరించవచ్చునని, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆయనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని తెలుసుకోవాలి!