మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన పాపిరెడ్డి పల్లె పర్యటనలో ఏం చేశారు? పాపం తాడేపల్లి నుంచి బెంగుళూరు ప్యాలెస్ కు బయల్దేరిన ఆయన మార్గమధ్యంలో పాపిరెడ్డి పల్లెలో కుటుంబసభ్యుడిని కోల్పోయిన వారిని పరామర్శించేందుకు కొంత సమయం కేటాయించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. ఆయన రాక వల్ల, కాసేపు తమతో గడపడం వల్ల.. టీవీ చానెళ్లలో కనిపించడం తప్ప.. లింగమయ్య కుటుంబానికి ఏం ఒరిగింది. పరామర్శ పేరుతో ఒక హైడ్రామా నడిపించిన జగన్మోహన్ రెడ్డి.. ఆ కుటుంబానికి ఏం భరోసా కల్పించారు? ఈ ప్రశ్నలకు మనకు ఈ పర్యటనలో అస్సలు జవాబులు దొరకవు. ఎందుకంటే.. జగన్ ఇచ్చిన భరోసానే ఏమీ లేదు.
లింగమయ్య కుటుంబాన్ని తెలుగుదేశం వాళ్లు చంపేశారు.. అని ఆరోపించడం తప్ప.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక మరణాలను అన్నింటినీ జాబితా కట్టి.. రాసుకు వచ్చిన ప్రసంగాన్ని చదువుతూ.. ఆ చావులన్నింటినీ.. తెలుగుదేశం చేసిన హత్యలేనని తీర్మానించడం మినహా.. జగన్ పాపిరెడ్డిపల్లెలో చేసిందేమీ లేదు. మహా అయితే.. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు వచ్చే చూస్తానని, ఆ బాధ్యత తీసుకుంటానని జగన్ వారితో చెప్పారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని అన్నారు.
ఇవి అస్సలు అర్థంకాని భరోసాలు. పార్టీ తరఫున న్యాయం చేయడం అనగా ఏమిటి? ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సాయం అందించే ఉద్దేశం జగన్ కు ఉందా? ఆయన స్వయంగా తన సొంతడబ్బులను సాయం చేస్తారా? లేదా, పార్టీ ఖజానానుంచి సాయం అందిస్తారా? ఎంత సాయం అందించబోతున్నారు.. వంటి ఏ ప్రశ్నలకు కూడా ఆయన పర్యటనలో జవాబులు దొరకవు. అంతే కాదు.. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని జగన్ అంటున్నారు. ఏం ఉద్యోగాలు ఇప్పిస్తారు? ప్రభుత్వ ఉద్యోగాలే ఇప్పించేట్లయితే.. మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చేదాకా.. వాళ్లు తిండీ తిప్పలూ లేకుండా ఆయన ఇప్పించే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ ఉండాలా? తనకు ఇమేజి ఉన్న ప్రెవేటు కంపెనీల్లో ఉద్యగాలు ఇప్పించేట్లయితే.. ఆ పని తన పర్యటన సమయానికే చేసి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది కదా..? అనేది ప్రజల సందేహం. వైసీపీ కార్యకర్త లింగమయ్య చనిపోయాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి.. జగన్ ఆ ఇంటికి రావడమే వారికి పెద్ద భరోసా.. అనే భావన ప్రజలకు కలగాలి. జగన్ వచ్చాడంటేనే.. వారి జీవితాలకు ఉద్యోగాలు వచ్చాయని, తాను అండగా ఉంటాననే సంగతి ఆయన మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా నిరూపించారనే అభిప్రాయం ఏర్పడాలి.
జగన్ తన పర్యటనలో అలాంటి భరోసా ఏమీ ఇవ్వలేదు. కేవలం నాలుగు మాటలు చెప్పారు. తెలుగుదేశాన్ని, చంద్రబాబును తిట్టడానికి కొన్ని పేజీలు, పోలీసులను నిందించడానికి, బెదిరించడానికి మరికొన్ని పేజీలు రాయించుకువచ్చిన ప్రసంగాన్ని చదివేసి వెళ్లిపోయారని ప్రజలు అనుకుంటున్నారు.