అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాంతిభద్రతల పరంగా ఎన్నో అరాచకాలు జరిగాయి. దాడులు, దొమ్మీలు, దహనాలు, హత్యలు ఇలాంటి వాటికి లెక్కేలేదు. ప్రత్యేకించి.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన సందర్భాల్లో కూడా.. వైకాపా మూకలు ఏ రీతిగా చెలరేగిపోయాయో అందరికీ తెలుసు. నామినేషన్లు వేయడానికి వస్తున్న వారిని కొట్టి, నిర్బంధించి ఏకగ్రీవంగా నెగ్గిన ఉదంతాలు మనం చూశాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చేసింది. ఎవరు ఏం అతి చేసినా, ఎక్కడ నిబంధనల్ని అతిక్రమించినా ఇప్పుడు వారిని అతిక్రమించడానికి, మందలించడానికి ఒక వ్యవస్థఉంది. రాష్ట్రంలో ఏం జరిగినా సరే ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అందుకు ఉదాహరణ ఇప్పుడే కనిపించింది. తెలుగుదేశం కార్యకర్తల హత్యలు, కారు దహనాలు చోటుచేసుకున్న ప్రాంతాలకు సంబంధించి.. ఆయా జిల్లాల ఎస్పీలను పిలిపించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ జిల్లాల పరిధిలో రాజకీయ హత్యలు, హింసాత్మక సంఘటనలు జరుగుతోంటే మీరు ఏం చేస్తున్నారు? వారిని ఎందుకు నియంత్రించలేకపోయారు? పరిస్థితులు హత్యల దాకా దిగజారిపోతోంటే మీరు ఏం చేస్తున్నారు? వంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు.
శాంతి భద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం ఏంటి? అంటూ నిలదీశారు. వారినుంచి సమాధానాలు తీసుకున్నారు. వారి సంజాయిషీలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నానమ,ి అక్కడినుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని ఆయన మీడియాకు వెల్లడించారు. మొత్తానికి ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీల మీద వేటు పడే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెదేపా నాయకుడు పాముల మునయ్య హత్యకు గురయ్యారు. ఆయనది రాజకీయ హత్యేనని ఆ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఎన్నికల అధికారి ఎదుట ఒప్పుకోవడం గమనార్హం. అయితే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో తెలుగుదేశానికి చెందిన ఇమాం హుస్సేన్ హత్యకు గురైతే.. ఎస్సీ రఘువీరారెడ్డి, అది కుటుంకక్షలే కారణమని, రాజకీయ కోణం లేదని చెప్పుకొచ్చారు. అయితే అరెస్టు అయిన నిందితులు గతంలో వైసీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాధ రెడ్డికి పూలమాలలు వేస్తున్న ఫోటోలు పత్రికల్లో రావడంతో వాటి గురించి కూడా సీఈఓ ప్రశ్నించారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం కార్యకర్త సురేష్ కారను వైసీపీ వారు దహనం చేశారు. అసలు ఆ జిల్లా శాంతి భద్రతల పరంగా సున్నితమైనదని తెలిసినా అప్రమత్తంగా ఎందుకు లేరంటూ ఎస్పీ రవిశంకర్ రెడ్డిని ప్రశ్నించారు. అక్కడైతే నిందితుల అరెస్టు కూడా జరగలేదు.
అయితే ముకేశ్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపిన నేపథ్యంలో.. ఈ ముగ్గురు ఎస్పీలపై వేటు పడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురు ఎస్పీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.