స్టార్ హీరోల సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించేంత వరకు కూడా వెళ్తుంది. మేము ముందు తేదీని వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు జరుగుతునే ఉంటాయి. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిన విషయమే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న సినిమానే పుష్ప -2. దాదాపు రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆగస్టు నుండి పోస్ట్ పోన్ అయి డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటన కూడా చిత్ర బృందం నుంచి వచ్చింది. కానీ ఇప్పటికి ఇంకా నెల రోజులకు పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. కొత్త షెడ్యూల్ జులై 2 మొదలు పెట్టాల్సి ఉండగా అది కాస్తా.. క్యాన్సిల్ అయింది.
దీంతో పుష్ప -2 విషయంలో అనేక రూమర్స్ వినిపించాయి. ఆ మాటలను నిజం చేస్తూ షూట్ ఆపేసి హీరో, దర్శకులు చెరో విమానం ఎక్కేసారు. బన్నీ కూడా గడ్డం తీసేసిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.ఇదిలా ఉండగా పుష్ప-2 డిసెంబర్ 6న రాదని ఆ డేట్ కి వచ్చేలా మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప టీమ్ ఏర్పాట్లు చేసుకున్నారు. పుష్ప రాదనే నమ్మకంతో మేము డిసెంబరు 6కు వచ్చేసాం అని అంటోంది కన్నప్ప చిత్ర బృందం. కానీ ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల చేయడం పక్కా అని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.
దీంతో తాము వెనక్కి తగ్గేది లేదని డిసెంబరు 6న విడుదల చేస్తామని తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో పోస్ట్ పెట్టారు కన్నప్ప నిర్మాత కమ్ హీరో విష్ణు మంచు.