వారందరూ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని.. రాజకీయంగా ఎదగాలని, వీలైతే ప్రజలకు ఏదైనా చేయాలని అనుకున్న వ్యక్తులు. అందరూ మహానుభావులు, సంఘోద్ధారకులు అని చెప్పలేం గానీ.. జగన్ నీడలో తమ రాజకీయ జీవితం బాగుంటుందని నమ్మినవారు! అయిదేళ్ల పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకత- రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీని తుడిచిపెట్టేసినా కూడా.. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వారు గెలిచారు. కానీ గెలిచినందుకు ఏమిటి ప్రయోజనం.. ‘‘దొంగల్లాగా దొంగచాటుగా వచ్చి వెళ్లిపోతున్నారు..’’ అని శాసనసభాముఖంగా స్పీకరు నోటినుంచి నింద పడాల్సి వచ్చింది. మహా అయితే తమ పదవులను కాపాడుకోవాలని వారు అనుకుని ఉండవచ్చు. అందుకే చాటుగా ఆ పనిచేసి ఉండవచ్చు. కానీ ‘దొంగల్లాగా’ వచ్చి వెళుతున్నారని మాటపడాల్సి వచ్చిందంటే.. ‘నిన్నున నమ్మినందుకు నీ సహచర ఎమ్మెల్యేలకు ఎంత ఖర్మ పట్టించావు జగనన్నా..’ అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. తనకు ప్రతిపక్ష నేతగా కేబినెట్ సమాన హోదా కల్పిస్తే తప్ప తాను శాసనసభకు హాజరయ్యేది లేదనే ఒక అనుచితమైన హామీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుని కూర్చుని ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన శపథానికి పాపం.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బలవుతున్నారు. ఎమ్మెల్యే అంటేనే.. తమ ప్రాథమిక బాధ్యత.. శాసనసభకు వెళ్లి అక్కడ తమ తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి చేతనైనత పోరాడడం కాగా.. ఆ పని చేయకపోతే.. నియోజకవర్గాల్లో ప్రజలు తమను అసహ్యించుకుంటారనే భయం ఆ 11 మందిలో కొందరికి ఉంది.
దానికి తోడు, పులిమీద పుట్రలాగా, 60 రోజుల పాటు వరుసగా శాసనసభకు హాజరు కాకపోతే గనుక.. వారి ఎమ్మెల్యే పదవి కూడా ఢామ్మంటుందని రాజ్యాంగం నిర్దేశించే నిబంధన తెరపైకి రావడం వారిని మరింతగా భయపెట్టింది. నిజానికి ఆ నిబంధన గురించి తెలిసిన తర్వాత.. శపథం చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా మడమ తిప్పి, అందరితో కలిసి ఒకరోజు శాసనసభకు వచ్చి కొన్నినిమిషాలు కూర్చుని ఆ వెంటనే పలాయనం చిత్తగించారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేల్లో ఇంకా పదవిపోతుందనే భయం ఉంది.
అలాంటి కొందరు ఎవ్వరికీ కనిపించకుండా శాసనసభ దాకా వచ్చి హాజరు రిజిస్టరులో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పని పిల్లలు చేస్తే వారిని బడిదొంగలు అంటారు. అలాంటి వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకరు అయ్యన్నపాత్రుడు గుర్తించారు. సభలోనే వారి తీరు గురించి తెలియజేస్తూ నిప్పులు చెరిగారు. గవర్నరు ప్రసంగం తరువాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో దొంగల్లాగా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని, వారెవ్వరూ తనకు సభలో కనిపించలేదని, వారు గౌరవంగా సభకు హాజరైతే బాగుంటుందని ఆయన హితవు చెబుతున్నారు. ఇలాంటి దొంగపనులు వారి గౌరవాన్ని పెంచదంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, దాసరి సుధ తదితరులు ఇలా దొంగచాటు సంతకాలు చేసినట్టు స్పీకరు చెబుతున్నారు. నిన్ను నమ్మినందుకు వారి పరువు ఇప్పుడు మరింతగా మంటగలిసింది కదా జగనన్నా అని కార్యకర్తలు అనుకుంటున్నారు.