ఒక రంగాన్ని నిలబెట్టడం అంటే.. కేవలం వారికి ఆర్థిక సాయం చేయడం మాత్రం సరిపోదు. ఉత్పాదకతకు ఉపయోగపడేలా చేసే సాయం, నిజం చెప్పాలంటే, సగం సాయమే అవుతుంది. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కూడా కల్పించే సాయం అందితే.. అప్పుడు పూర్తి సాయం అందినట్టు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని స్వయం సమృద్ధంగా చేయడంకోసం, సొంత కాళ్లపై నిలబడేలా చేయడం కోసం చంద్రబాబునాయుడు ఒక వైపు జీఎస్టీ రాయితీలు, ఉచిత విద్యుత్తు ప్రకటించగా.. అదే చేనేత రంగం బాగుకోసం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తన వంతు మాట సాయం చేస్తున్నారు. వారి మార్కెటింగ్ అవకాశాలకు ఒక స్థిరత్వం కల్పిస్తున్నారు. యువతరం మొత్తం వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు మాత్రమే ధరించేలా ఒక నియమానికి కట్టుబడాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇస్తున్నారు.
‘అసంఘటిత చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానూ ఊతమిస్తోందని చెప్పిన పవన్ కల్యాణ్.. యువతరం వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరిస్తే ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి- అని అంటున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇలాంటి పిలుపు ఇవ్వడాన్ని గమనించాలి.
ఆధునిక సమాజంలో కుదేలవుతున్న చేనేత వంటి రంగాలకు కేవలం ఉత్పత్తికి అవసరమైన చేయూత మాత్రమే కాదు.. తమ ఉత్పత్తులకు సరైన గిరాకీ లేకపోవడం కూడా ఎప్పుడూ ఒక సమస్యే అవుతుంటుంది. ప్రభుత్వం పరంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనినట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందించేలా, కేంద్రానికి చెల్లించే జీఎస్టీని కూడా రాష్ట్రప్రభుత్వమే భరించేలా చంద్రబాబు నిర్ణయాలను ప్రకటించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్.. రాష్ట్రంలోని యువతరం అంతా కూడా.. కనీసం వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపు ఇస్తున్నారు.
నిజానికి చేనేతరంగం సరైన రీతిగా బతకాలంటే, మనుగడ సాగించాలంటే.. స్థానికంగానే ఆ దుస్తుల వినియోగం పెరగాలి. చేనేత దుస్తులను వారానికి ఒక రోజైనా ధరించడం అనేది ప్రజలందరూ ఒక బాధ్యతగా భావించాలి. ఇందుకు నాయకులు, సెలబ్రిటీలో ప్రజలకు ప్రేరణ ఇవ్వాలి. సామాజిక ఉపయోగం ఉన్న అంశాల గురించి ఏ రకంగా అయితే.. ప్రమోషనల్ యాడ్స్ సెలబ్రిటీలు చేస్తుంటారో.. అదేరీతిగా.. చేనేత రంగాన్ని పరిరక్షించే ఆలోచనకు కూడా వారు బాధ్యత తీసుకోవాలి. గతంలో తమిళనాడులో ఒక యూనివర్సిటీ విద్యార్థులు.. ఇలా చేనేత దుస్తులు వారంలో ఒకరోజు ధరించాలనే నియమాన్ని ఒక ఉద్యమంలా పాటించారు. ఈ ఆలోచన తమిళనాడులోని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు కూడా పాకింది. దీనివల్ల స్థానికంగా చేనేత రంగానికి ఎంతో గొప్ప మేలు జరిగింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా అదే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో యువతరంలో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏ ఇతర సినీ సెలబ్రిటీకి గానీ, రాజకీయ నాయకుడికి గానీ లేదన్నది స్పష్టం. ఆయన పిలుపు యువతరం అందుకోవాలి. చేనేత ఉత్పత్తులను వాడడానికి ముందుకు రావాలి. తమ తమ ప్రాంతాల్లో తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఆదరించాలి. దీనివల్ల.. ఏ ప్రాంతంలోనూ చేనేత రంగం కుదేలయ్యే దుస్థితి రాదు. చేనేత కార్మికులు ఆకలి చావులు చచ్చే పరిస్థితి రాదు. నాయకుల మాటలను వారిని ఆరాధించే వారందరూ పాటిస్తే గనుక.. చేనేత రంగానికి ఎంతో మేలు జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.