ఒక చిన్న పాత సంఘటనను గుర్తు చేయాలి. కుప్పం మునిసిపాలిటీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీకి ముందు బిఎసి సమావేశం జరిగినప్పుడు తెలుగుదేశం తరఫున హాజరైన అచ్చన్నాయుడుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎగతాళిగా ఒక మాట అన్నారు. ‘ఒక్కసారి మీ చంద్రబాబును రమ్మని చెప్పు అచ్చన్నా మొహం చూడాలని ఉంది’ అని హేళన చేశారు. ఇప్పుడు అలాంటి ఘటనే పునరావృతం అవుతోంది. ‘ఒక్కసారి అసెంబ్లీకి రారాదా జగన్మోహన్ రెడ్డీ నిన్ను చూడాలని ఉంది.. ముచ్చట్లు చెప్పుకుందాం’ అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు.
తెలుగుదేశం నాయకులలో పదునైన విమర్శలు చేయడానికి పెట్టింది పేరైన అయ్యన్నపాత్రుడు తాజాగా జగన్ మీద చలోక్తులు విసురుతున్నారు. అసెంబ్లీకి వస్తే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే ఆలోచనతోనే జగన్ అసలు అసెంబ్లీకి రావడం మానుకున్నారని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు తనకంటే పెద్దవారైనా.. హోదా పెద్దదైనప్పటికీ కూడా అసెంబ్లీలో తనకు నమస్కారం పెట్టి తీరాల్సిందేనని.. అలా జగన్ రెడ్డి కూడా సభకు వస్తే తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుంది కనుక అది ఇష్టం లేక రావడం మానుకున్నారని అయ్యన్న అంటున్నారు. చంద్రబాబు నాయుడు పిలిచి మంత్రి పదవి రానందుకు బాధగా ఉందా అని అడిగితే మంత్రులందరూ కూడా విధిగా గౌరవించాల్సిన పెద్ద హోదాను కట్టబెట్టినందుకు సంతోషంగా ఉందని చెప్పినట్లుగా అయ్యన్న పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఒకసారి అసెంబ్లీకి వస్తే చూడాలని ఉన్నదని ఆయనతో సరదాగా ముచ్చట్లు చెప్పుకోవాలని ఉందని అయ్యన్నపాత్రుడు అనడం విశేషం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా తనను అవమానించారని ఆరోపిస్తూ అసలు సభకు రావడమే మానుకున్న సంగతి తెలిసిందే. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిన పార్టీతో అంత చిన్న జట్టుతో కలిసి సభలో కూర్చోవడం అవమానం గనుక మొహం చెల్లకపోవడం వల్లనే ఆయన రావడం లేదని కొందరు అంటుండగా, ఆయన మాత్రం ప్రోటోకాల్ పాటించడం లేదని సాకులు చెప్పి సభకు రాకుండా ఉండిపోతున్నారు. అయ్యన్న ఇవాళ అయనను హేళన చేయగలుగుతున్నారంటే ఆయన ఇచ్చిన అవకాశమే కారణం అని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత శాసనసభకు వెళ్లడం ప్రజా సమస్యలను ప్రస్తావించడం అనేది తన ప్రాథమిక బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు.