‘వాలంటీర్లను ప్రలోభపెడతాం.. అడ్డొస్తే కొడతాం!’

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తూ.. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయడానికి పార్టీ ఏజంట్లలాగా పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ఎంతగా దారితప్పిపోయిందో అందరికీ తెలుసు. వారి సేవ వారు చేస్తుండగా.. వారిని మరింతగా ప్రలోభపెట్టి, భారీగా వారికి డబ్బు, కానుకలు ఇచ్చి లోబరచుకుని.. మరింతగా తమ పార్టీ కార్యకర్తల్లాగా ప్రచారానికి వాడుకోవాలని.. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మొన్నమొన్నటిదాకా వాలంటీర్లతో సమావేశాలు పెట్టుకుంటూ.. వారికి డబ్బు, స్మార్ట్ ఫోన్లు, ఇతర కానుకలు ఇస్తూ చెలరేగినా కూడా.. పెద్దగా రచ్చ కాలేదు. కానీ, ఎన్నికల షెడ్యూలు విడుదలై, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వంనుంచి రెమ్యునరేషన్ పొందుతున్న వాలంటీర్లు నాయకులతో కలిసి తిరిగితేనే వారి మీద వేటు పడుతోంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా వారితో ప్రెవేటుగా సమావేశాలు పెట్టుకుని ప్రలోభపరచడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

అలాంటి వాలంటీర్ల సమావేశం వద్దకు వెళ్లినందుకు తెలుగుదేశం అభ్యర్థిని వైసీపీ మనుషులు తీవ్రంగా కొట్టడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం అవుతోంది.

ఒకవైపు తెలుగుదేశం కార్యకర్తలను చంపేస్తున్నారు. వారి వాహనాలను తగులబెట్టేస్తున్నారు. మరోవైపు ఏకంగా అభ్యర్థి మీదనే దాడిచేసి కొడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయో.. పోలింగ్ రోజు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో.. వైసీపీ గూండాలు ఎలా రెచ్చిపోబోతున్నారో ఇప్పటినుంచే ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తెలుగుదేశం తరఫున గతంలో కలెక్టరుగా పనిచేసిన బూర్ల రామాంజనేయులు పోటీచేస్తున్నారు. అక్కడ వైసీపీ తరఫున బలసాని కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన వాలంటీర్లను ప్రలోభపెట్టేందుకు వారికి తాయిలాలు ఇవ్వడానికి  ఓ సమావేశం పెట్టుకోగా, అక్కడకు బూర్ల రామాంజనేయులు వెళ్లారు. అంతే.. వైసీపీకి చెందిన వారు ఆయన మీద పడి కొట్టడమూ, ఆయన కారును ధ్వంసం చేయడమూ జరిగింది. ఇదంతా సదరు కార్యక్రమానికి భద్రత కల్పించడానికి వచ్చిన పోలీసుల సమక్షంలోనే!
‘కలెక్టరుగా పనిచేసిన నా పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఈ రాష్ట్రంలో సామాన్యుడి సంగతేంటని’ ఆరోపిస్తూ బూర్ల రామాంజనేయులు.. జిల్లా ఎస్పీ తుషార్ డూడీని కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులను దాడికి ప్రేక్షకులుగా మార్చిన సీఐపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదుచేయడం విశేషం. శాంతి భద్రతల్ని అదుపు తప్పించడం ద్వారా మాత్రమే ప్రజల్ని భయపెట్టి నెగ్గాలని అధికార పార్టీ అనుకుంటున్నట్టు ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories