ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను ఇంకా ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకుంటూ.. తన స్వకార్యాలు చక్కబెట్టుకోగల పొజిషన్ లోనే ఉన్నారని భ్రమపడుతూ ఉండవచ్చు. డీఎంకే స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం ద్వారా.. మోడీని మరింత ఇంప్రెస్ చేసి ఉంటానని భ్రమిస్తుండవచ్చు. కానీ.. వాస్తవం ఏమిటో ఆయన కాస్త రాష్ట్రస్థాయి రాజకీయాల్ని గమనించి తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్డీయే కూటమి రాజ్యం చేస్తోంది. భాజపా మీద విమర్శలు చేయకుండా.. తెలుగుదేశం, జనసేనలను మాత్రం ఆడిపోసుకుంటూ.. రాజకీయం చేస్తే.. మోడీ తనను ఆదరిస్తారనే ఆలోచన జగన్ లో ఉండవచ్చు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే తమ లక్ష్యం అని కమలనేత విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు కూడా లేకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఒకప్పటి బిజెపి సారథి, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన సోము వీర్రాజు చెబుతున్న మాటలను గమనిస్తే.. అవి జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలే అని అర్థమవుతుంది.
సోము వీర్రాజు మీద జగన్ అనుకూల కమల నేత అనే ఆరోపణ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో.. ఆయన మాటలు, ప్రకటనలు అలాగే కనిపించేవి. జగన్ అనుకూల ధోరణి ఉండేది. నిజం చెప్పాలంటే సోము వీర్రాజును పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి ఉన్న కారణాల్లో అది కూడా ఒకటి అని పార్టీలో ఒక వర్గం వాదిస్తుంటుంది. ఆ తర్వాత.. సారథ్యం స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి జగన్ అరాచకాల మీద విరుచుకుపడడంలో దూకుడు ప్రదర్శించారు. పదవి పోయిన తర్వాత సోము వీర్రాజు సైలెంట్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా నెగ్గిన తర్వాత.. ఒకప్పట్లో రాష్ట్ర పార్టీకి సారథ్యం వహించిన ఈ కమల నేత ఇప్పుడు జగన్ మీద నిప్పులు చెరగుతున్నారు.
ప్రతిపక్ష హోదా నేతగా గుర్తింపు ఇస్తే మాత్రమే.. శాసనసభకు వస్తానని అంటున్న జగన్మోహన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని సోము వీర్రాజు తీవ్రంగా ఎండగడుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఉందని, అయినా కూడా సభకు రాలేదని.. ఇప్పుడు మాత్రం ఆ సాకు చూపి సభకురానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని సోము ఎద్దేవా చేస్తున్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఆ పార్టీకి రాష్ట్రంలో 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని అంటున్నారు. మళ్లీ సీఎం అవుతాననే భ్రమలో అధికారుల్ని జగన్ బెదిరిస్తున్న తీరును సోము తప్పుపడుతున్నారు. కూటమి లక్ష్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే అని కూడా అంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని వీడిపోదలచుకున్న నేతలకు భారతీయ జనతా పార్టీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతించే ఉద్దేశంతో ఉన్నదని చాలా కాలంగా పుకార్లున్నాయి. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఇదివరలో కొన్ని సంకేతాలు ఇచ్చారు. కానీ.. ప్రస్తుతం.. సోము వీర్రాజు మాటలు గమనిస్తోంటే.. కేవలం ఒకటి రెండు చేరికలతో ఆగకపోవచ్చునని.. ఆయన అన్నట్టుగా ఖాళీ చేసేలా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.