వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. తెలుగుదేశం పార్టీ వారి గురించి ఎలాంటి విపరీత వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. ఇళ్లలోంచి ఈడ్చి బయటకు తీసుకువచ్చి కొడతాం.. నరికి పారేస్తాం అంటూ ఆయన తెగ రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలకు స్పందించడం విశేషం కాదు. కానీ.. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కు కూడా ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ఆగ్రహం తెప్పించాయి. నోటిమీద అదుపులేని కారుమూరి దూకుడుపట్ల ఆయన కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ‘ఎవరికి ఏ భాష అర్థమవుతుందో.. వారికి ఆ భాషలోనే కదా చెప్పాలి’ అనే సిద్ధాంతం ప్రకారం భారతీయ జనతా పార్టీలో సౌమ్యుడిగా పేరున్న శ్రీనివాస వర్మ కూడా చాలా ఘాటుగానే కారుమూరికి వార్నింగ్ ఇచ్చారు.
‘ఎర్రి పప్ప కారుమూరి తణుకు మునిసిపాలిటీలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. త్వరలోనే జైలుకెళ్లి చిప్పకూడు తింటాడు’ అంటూ శ్రీనివాస వర్మ హెచ్చరించారు. అంతటితో ఆగలేదు. ‘ఎర్రిపప్ప కారుమూరి.. నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు చేతులు నరికిస్తాం.. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో’ అని కూడా హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో జరిగిన నేరాలు, ఘోరాల మీద కేసులు పెడుతున్నందుకే కారుమూరి నాగేశ్వరరావు విపరీతంగా రెచ్చిపోవడాన్ని మనం గమనించాం. అయితే అలాంటి ‘నరికే’ భాషలో చెబితేతప్ప ఆయనకు అర్థం కాదు గనుక.. ఎంతో మెతక స్వభావం గల నాయకుడిగా పేరున్న శ్రీనివాసవర్మ కూడా అలా మాట్లాడాల్సి వచ్చిందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
కేంద్రమంత్రి మాటల్లోని మర్మం గమనిస్తే ఆ హెచ్చరికల సీరియస్ నెస్ కూడా అర్థం అవుతుంది. వైఎస్సాఆర్ జగన్ పాలన కాలంలో.. తమ పార్టీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు దోచుకోవడానికి ఆయన స్వబుద్ధితో కనిపెట్టిన రెండు అద్భుతమైన తప్పుడు మార్గాలు.. పేదలకు సెంటు భూమి స్థలాల పంపిణీ మరియు టీడీఆర్ బాండ్లు. పేదలకు సెంటుభూమి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఎకరా నాలుగైదు లక్షలు చేసే భూములను బినామీలతో కొనిపించి, ఆ తర్వాత అదే భూములను ఇంటి స్థలాల కోసం ప్రభుత్వానికి యాభైలక్షలకు అంతకంటె ఎక్కువ ధరకు విక్రయించి.. కోట్లకు కోట్లరూపాయలు ఎమ్మెల్యేలు దండుకున్నారు. అదే మాదిరిగా మునిసిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో టీడీఆర్ బాండ్ల రూపంలో అనేక వందల కోట్ల రూపాయల అవినీతి దందాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, పత్రాలు సృష్టించడం.. తిరిగి వాటిని ప్రభుత్వానికి టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వడం.. వందల కోట్ల దందా సాగించడం జరిగిపోయింది. రాష్ట్రంలో అనేక ప్రధాన నగరాల్లో ఈ వివాదాలన్నీ ఇంకా విచారణ దశలో ఉన్నాయి. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ హెచ్చరికలను గమనిస్తే.. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కోట్లు మేసిన వైసీపీ నేతలందరూ కూడా త్వరలోనే జైలు పాలు కావాల్సి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.