మత్స్యరాస రాజు గారికి షాక్ తప్పదా?

ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కించుకొని మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఘనవిజయం సాధించారు. గెలిచిన 11 మందిలో- ఐదువేల కంటె లోపు మెజారిటీతో చాలామంది ఉన్నప్పటికీ.. ఆ రాజుగారు ఏకంగా 19 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.

అయినా సరే ఎమ్మెల్యే పదవి ఆయనకు స్వల్పకాలిక భాగ్యంగా మారుతుందేమో అనే భయం వెన్నాడుతోంది. ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ ఓడిపోయిన అభ్యర్థి న్యాయపోరాటం ప్రారంభించడంతో ఆయనలో గుబులు మొదలైంది. ఆయన మరెవరో కాదు  ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దయపెట్టిన రెండు సీట్లలో ఒకటైన పాడేరు ఎమ్మెల్యే.

చంద్రబాబు నాయుడు మరో అభ్యర్థిని ఎంపిక చేసినప్పటికీ, చివరి దాకా టికెట్ కోసం పోరాడి దక్కించుకున్న తెలుగుదేశం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పాడేరు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే నెల రోజుల తర్వాత మత్స్యరాస విశ్వేశ్వర రాజు విజయం  మీద ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉంటూ లక్షల రూపాయల వేతనం తీసుకున్న సంగతిని విశ్వేశ్వర రాజు ఎన్నికల నామినేషన్ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనలేదని.. ఆ రకంగా ప్రభుత్వాన్ని మోసం చేశారని గిడ్డి ఈశ్వరి ఆరోపిస్తున్నారు.

ఇదే నిజమైతే.. తప్పించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఆమె ఇతరత్రా అంశాల మీద ఆరోపణ చేయలేదు. ఆయన ఎస్టీ కాదు, ఆయన ఎస్టీ అనే తప్పుడు ధృవపత్రాలు పెట్టారు.. లాంటి ఆరోపణలు చేసి ఉంటే.. నిజా నిజాలు తేలడానికి చాలా కాలం పట్టేది. అలాకాకుండా చాలా స్పష్టంగా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉండగా లక్షల రూపాయలు వేతనాలు తీసుకున్న వైనం మాత్రమే ఆమె ప్రస్తావించారు. ఆ వివరాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఇలాంటిది చిటికెలో తేలిపోయే వ్యవహారం.

న్యాయస్థానంలో విచారణ సాగవలసి ఉంది. మత్స్యరాస విశ్వేశ్వర రాజు చేసిన తప్పును కోర్టు ఎలా పరిగణిస్తుందో తేలవలసి ఉంది. ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఆస్థానంలో తాను గెలిచినట్లుగా ప్రకటించాలని గిడ్డి ఈశ్వరి హైకోర్టును కోరుతున్నారు. మరి ఓడినా సరే శాసనసభలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న గిడ్డి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories