తుపాకీ చూపి బెదిరించి, సత్తిని బుక్ చేశారా?

జగన్ మీద రాయివిసిరినట్టుగా వేముల సతీష్ అనే వడ్డెర కాలనీకి చెందిన యువకుడు అంగీకరించినట్టుగా.. ఆయన వెనుక ప్రోద్బలం చేసినది ఎవరు అనేది మాత్రమే ఇంకా తేల్చవలసిన విషయంగా పోలీసులు చెబుతున్నారు. వేముల సతీష్ అలియాస్ సత్తి అరెస్టు, కోర్టుకు కూడా రిమాండు రిపోర్టు సమర్పించిన నేపథ్యంలో జగన్ మీద రాయి విసిరిన కేసు దాదాపుగా తేలిపోయినట్టే పోలీసులు మాట్లాడుతున్నారు. అయితే వేముల సతీష్ నేరాన్ని అంగీకరించిన మాట నిజమేనా అనే విషయంలో అనేక సందేహాలున్నాయి.

వడ్డెర కాలనీలోని మొత్తం అయిదుగురు కుర్రాళ్లను (నలుగురు మైనర్లే) అదుపులోకి తీసుకున్న పోలీసులు సత్తిని దోషిగా ఎలా ఖచ్చితంగా నిర్ధారించారనేది ఇంకా బయటకు రానేలేదు. దానికి సంబంధించిన ఆధారాలు బయటకు రాలేదు. అసలే చీకటి, పైగా జనం రద్దీ అని సాక్షాత్తూ కమిషనర్ చెప్పిన తర్వాత.. నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలియదు. కాకపోతే.. అతడు నేరం ఒప్పుకున్నట్టుగా ప్రచారం మీదనే రకరకాల సందేహాలు కలుగుతున్నాయి.

పోలీసులు సత్తిని తుపాకీ చూపించి బెదిరించి మరీ.. నేరం ఒప్పించారనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. అతని తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘‘జైలులో సతీష్ ను కలిసి మాట్లాడాం. ఏం జరిగిందని అడిగితే.. పోలీసులు తనని చీకట్లోకి తీసుకెళ్లి నేరం ఒప్పుకోమని తుపాకీ చూపించి బెదరించినట్లుగా చెబుతున్నాడు. అందుకే అలా చెప్పానని ఏడుస్తున్నాడు. తనకేం సంబంధం లేదని, తానేం చేయలేదని అంటున్నాడు’ అని అన్నారు. అంటే పోలీసులే బలవంతంగా సత్తితో నేరం ఒప్పించినట్టుగా అనుమానాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. సోమవారం నాడు మేజిస్ట్రేట్ ఎదుట సత్తి వాంగ్మూలం రికార్డు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. నిందితుడు సతీష్ రాయి విసురుతుండగా చూసిన వారు ఎవరూ లేరు. అందువల్ల కస్టడీలోకి తీసుకుని విచారించడం అనే ఆలోచన పక్కకు పెట్టి, ముందుగా మేజిస్ట్రేటు వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories