వర్రా రవీందర్ రెడ్డి ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా నిలిచిన వార్తల్లో వ్యక్తి. వైఎస్ భారతికి ఆయన పియే అని తొలుత ప్రచారం జరిగినా, భారతి సిమెంట్స్ లో ఉద్యోగి అని తర్వాత చెప్పుకొచ్చారు. అలాగే పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి వైసీపీలోని అనేకమంది ప్రముఖులకు సన్నిహితులుగా ముద్ర పడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళందరి కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ అసభ్య పోస్టులు పెట్టడం మాత్రమే కాదు.. ఇలాంటి దుర్మార్గాలలో ఆయన వైయస్ జగన్ చెల్లెలు షర్మిలను, తల్లి విజయమ్మను కూడా వదిలిపెట్టలేదు! ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన తర్వాత వారి విచారణలో పేర్కొన్న విషయాలు అనేకమంది పార్టీ పెద్దలను కేసుల్లోకి లాగే లాగా కనిపిస్తున్నాయి. కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం అనేక విషయాలు వెల్లడవుతున్నట్టు తెలుస్తోంది.
అసభ్య, దుర్మార్గమైన పోస్టులు పెట్టడంలో సజ్జల భార్గవరెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన పిఏ రాఘవరెడ్డి, ఇంకా అర్జున్ రెడ్డి, సుమారెడ్డి లతోపాటు ఐప్యాక్ కు చెందిన ప్రతినిధుల హస్తం కూడా ఉన్నదని వర్రా రవీందర్ రెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది. తమకు పోస్టులు పెట్టడానికి తగిన కంటెంట్ రాఘవరెడ్డి నుంచి, ఐప్యాక్ నుంచి వచ్చేదని ఆయన చెబుతున్నారు. 2023 నుంచి తన ఫేస్బుక్ ఖాతాలో సజ్జల భార్గవరెడ్డి పోస్టులు పెడుతున్నాడని కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టినట్లుగా వర్రా ఒప్పుకున్నట్లుగా సమాచారం.
ఎలాంటి పోస్టులు పెట్టాలనేది వైయస్ అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి చర్చించుకునే వారని ఆయన చెబుతున్నారు. ఈ రిమాండ్ రిపోర్టులోని విషయాలన్నీ వాస్తవమే అయితే గనుక.. వైసీపీ ప్రముఖులు సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో గట్టిగానే చిక్కుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సజ్జల భార్గవరెడ్డి మీద లుక్ అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచే పోస్టు అయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇపుడు వర్రా మాటలను గమనిస్తే.. ఆయన ఫేస్ బుక్ ఖాతాలను సజ్జల భార్గవ రెడ్డి వాడేవాడని వింటోంటే.. రిమాండ్ రిపోర్టులోని సంగతులు నిజమే అయి ఉండవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.