వార్నింగ్ బెల్స్ : నయా ఎమ్మెల్యేలు బీ అలర్ట్!

సాధారణంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వదలచుకున్న వారికి ఎమ్మెల్యే పదవి అనేది ప్రాథమిక కలగా ఉంటుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యే అయిన తొలి సందర్భంలోనే అవినీతికి రాచబాటపరిచేసి.. అడ్డగోలుగా ప్రజల్ని దోచుకుని సంపాదించుకోవాలని అనుకునే వారు చాలా తక్కువగా ఉంటారు. ఒకసారి ఎన్నికల్లో నెగ్గితే.. మళ్లీ మళ్లీ నెగ్గేలా ప్రజల ప్రేమను, ఆదరణను సుస్థిరం చేసుకోవాలనే బ్యాచ్ ఎక్కువగా ఉంటారు. ముందు దక్కిన అవకాశాన్ని వాడుకుని, ప్రజల మనసుల్లో తమ స్థానం సుస్థిరం చేసుకుంటే.. మళ్లీ మళ్లీ నెగ్గే పరిస్థితి ఏర్పడితే.. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చునని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ… ఇప్పుడంతా రాజకీయ వాతావరణం తేడాగా మారిపోయినట్టు కనిపిస్తోంది.

మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారే.. ఎక్కువగా అవినీతికి పాల్పడుతూ, అరాచకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదేదో యథాలాపంగా చెబుతున్న  మాట కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సుదీర్ఘ పరిశీలన తర్వాత.. తన సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించి చెబుతున్నమాట. నిరంతరం తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద ఒక నిఘానేత్రం తెరచి ఉంచి.. వారి వ్యవమారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండే.. చంద్రబాబునాయుడు కొత్త ఎమ్మెల్యేలు గాడితప్పిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని హెచ్చరిస్తున్నారు.

సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు కాబట్టి పద్ధతిగా నడుచుకుంటున్నారని.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా ఉండాల్సిందిపోయి.. అక్కడక్కడ గాడి తప్పుతున్నారని చంద్రబాబు పేర్కొనడం విశేషం. ఇప్పటిదాకా 35 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడినట్టుగా చంద్రబాబు చెబుతున్న గణాంకాలు పార్టీకి ప్రమాదఘంటికల్లాంటివి. అదే సమయంలో.. దారి మార్చుకోకపోతే.. ఇక చీటీ చించేయాల్సి వస్తుందనే వార్నింగ్ బెల్స్ ను కూడా చంద్రబాబు మోగిస్తున్నారు.
ఒకసారి పిలిచి పద్ధతి మార్చుకోవాలని చెబుతాను.. తీరు మారకపోతే, రెండోసారీ పిలిచి చెబుతాను. అప్పటికీ మారకపోతే మూడోసారి చెప్పడం ఇక ఉండదు. కఠినంగా వ్యవహరిస్తాను- అని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అసలు రెండోసారి పిలవాలా వద్దా అన్నది కూడా వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని అధినేత పేర్కొనడం గమనించాలి.

కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేయడం సరి కాదు. సమన్వయకర్తలు, ఇన్చార్జి మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పండి.. అని చంద్రబాబు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలురకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మహిళల్ని అసభ్యంగా వేధిస్తున్న వ్యవహారాల్లో కొందరు, నియోజకవర్గంలో ఇతర నాయకులతో విభేదాలతో కొందరు, అవినీతి దందాలతో కొందరు, నేరగాళ్లకు కాపు కాస్తూ కొందరు ఇలా కొత్త ఎమ్మెల్యేలు పలువురు రకరకాలుగా పార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోగిస్తున్న వార్నింగ్ బెల్స్ సహేతుకమే అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
కొత్తగా ఎన్నికైన వారు.. తమ పదవి పది కాలాలపాటూ ఉండాలని కోరుకోవాలి గానీ.. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తరహాలో వ్యవహరించడం వారికే చేటు చేస్తుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories