రోజుల్లోనే చేతులు మారనున్న విశాఖ మేయర్ పీఠం!

‘‘కొండనాలుకయ్యిందని మహామహులు మందేస్తే.. ఉన్న నాలుకూడిపోయె..’’ అంటూ ఓ సినీగీతం చాలా ఆవేశంగా సాగిపోతుంది. ఇప్పుడు విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కు సంబంధించినంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. విశాఖ నగర కార్పొరేషన్ లో మనకు అరివీర బీభత్సమైన మెజారిటీ ఉన్నది.. మనకిక ఎదురులేదు అనుకుని విర్రవీగారు. తీరా రాష్ట్రంలో ప్రభుత్వం మారేసరికి.. ఆ బలం మొత్తం వాపు మాత్రమే అని తేలిపోయింది. పైకి నెంబరు కనిపించినా.. లోన అంతా డొల్ల అని గ్రహించారు. మేయర్ పీఠం కూడా చేజారుతుందనే భయం పుట్టిన తర్వాత.. ముగ్గురు మహామహులను రంగంలోకి దించారు. వలసల్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఆ పప్పులేం ఉడకలేదు. విశాఖ నగర మేయర్ పీఠం.. తెలుగుదేశం  చేతిలోకి వెళ్లడం.. నేడో రేపో అనగల స్థితికి చేరుకుంది.

విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు తెలుగుదేశం కార్పొరేటర్లు, కలెక్టరుకు లేఖ కూడా సమర్పించారు.  కూటమి నేతలు పీలా శ్రీనివాసరావు, వెలగపూడి, గణబాబు, గండి బాబ్జీ మరికొందరు కలెక్టరును కలిసి వినతిపత్రం అందించారు. మునిసిపాలిటీల్లో నాలుగేళ్ల పదవీకాలం గడిచేవరకు మేయరుపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీల్లేదనే నిబంధన ఉంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ సభ్యులు చాలా మంది వచ్చి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. కొన్ని రోజుల కిందట కూడా ఆరుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు. మరో ఆరుగురు కూడా టీడీపీ, జనసేనల్లో చేరబోతున్నారనే వదంతులు ఉన్నాయి. కూటమి బలం అవిశ్వాసం నెగ్గించుకోగల పరిమితికి మించి పెరిగింది.

ఈ నేపథ్యంలో మార్చి 18 నాటికి.. అవిశ్వాసానికి అవసరమైన నాలుగేళ్ల కాలపరిమితి అనేది ముగిసిపోయింది. ఇప్పుడు ఆ స్థానం దక్కించుకోవడానికి తెలుగుదేశం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో పలు మునిసాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లే పార్టీమారిన దృష్టాంతాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా కూటమి బలం బాగా పెరిగింది. అయితే నాలుగేళ్ల గడువు పూర్తయిన ప్రతిచోట అవిశ్వాసం ద్వారా కూటమి జెండా ఎగరేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

విశాఖ విషయానికి వస్తే.. వలసలు నిరోధించడానికి వైసీపీ మహామహులుగా బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్, కురసాల కన్నబాబు రంగంలోకి దిగారు. చాలా రకాలుగా తమ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. కానీ వారీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక రోజుల వ్యవధిలోనే విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం పరం కానున్నది. 

Related Posts

Comments

spot_img

Recent Stories