రాజకీయ అవినీతి, జగన్ చేసిన ఆర్థిక నేరాల్లో ఏ2గా కీలక పాత్ర, జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో పాల్పడిన భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాలు.. విజయసాయిరెడ్డి గురించి చెప్పుకోవాలంటే ప్రజలకు ఇవి మాత్రమే తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే ఆయన కూడా బెయిలు మీద బాహ్యప్రపంచంలో తిరుగుతున్న నాయకుడు అని కూడా తెలుసు. అలాగే.. ఆయన దేశం దాటి బయటకు వెళ్లాలంటే.. కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిధిలో ఉన్నారని కూడా ప్రజలకు తెలుసు. కానీ.. ఆయన వృత్తిపరమైన నేరాలకు కూడా పాల్పడినట్టు, ఆయన వృత్తికి సంబంధించిన క్రమశిక్షణ సంఘం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిందనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. వృత్తిని అడ్డుపెట్టుకుని అనైతికంగా, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించిన నేరాలకు పాల్పడినందుకు.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆయన మీద చర్య తీసుకోబోతున్నది. వ్యక్తిగత దుష్ప్రవర్తనకు సంబంధించి విచారణకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం ఇప్పుడు హైకోర్టు దాకా వెళ్లింది.
ఇంతకూ ఏం జరిగిందంటే..
విజయసాయిరెడ్డి చెన్నై కేంద్రంగా చార్టర్డ్ అకౌంటెంట్ గా సేవలందిస్తూ.. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగతి పబ్లికేషన్స్ తదితర సంస్థలకు అనైతికంగా, అడ్డదారుల్లో పెట్టుబడులు సమీకరించారని, డెల్లాయిట్ నుంచి జగతి పబ్లికేషన్స్ సంస్థ విలువను మదింపు చేయడంలో పెంచుతూ తప్పుడు నివేదిక తీసుకోవడంలో కూడా విజయసాయిరెడ్డిది కీలక పాత్ర అని, అలాంటి తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు కూడా సమీకరించారిన ఐసీఏఐ గుర్తించింది. ఈ విషయంలో ఆయనకు విచారణకోసం నోటీసులు ఇచ్చారు.
చార్టర్డ్ అకౌైంటెంట్లకు సంబంధించిన ఆ సంస్థకు తనకు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటూ విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసులను సింగిల్ జడ్జి రద్దు చేశారు. ఇప్పుడు ఐసీఏఐ అప్పీలుకు వెళ్లింది. కేసు పూర్వాపరాలు తెలుసుకోకుండా నోటీసులను సింగిల్ జడ్జి రద్దు చేయడం తగదని అప్పీలు చేశారు. పైగా ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి తెలంగాణ హైకోర్టులో కేసు వేయజాలరని పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు ఆయన కార్యాలయం గానీ, నోటీసులు ఇచ్చిన ఐసీఏఐ కార్యాలయం గానీ చెన్నైలోనే ఉన్నందున.. తమిళనాడు హైకోర్టులో మాత్రమే కేసు వేయాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విజయసాయికి ఎలాంటి తీర్పు ఎదురవుతుందో చూడాలి.