విజయసాయి అరెస్టు ఇక సింపుల్! అయితే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన వేణుంబాక విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఛైర్మన్ ఆమోదం కూడా పొందింది. ఇప్పుడు ఆయన మాజీ ఎంపీ అయ్యారు.  ఆయన మీద ఉన్న అవినీతి అక్రమార్జనల కేసులకు గానీ, బెదిరింపులు, వాటాల కబ్జా తదితర వ్యవహారాలకు సంబంధించిన కేసులకు గానీ.. ఈ తాజా పరిణామం ఎలాంటి విరామం ఇవ్వదు గాక ఇవ్వదు! కాగా, ఎలాంటి కేసు నమోదు అయినప్పటికీ.. ఆయనను విచారణకు పిలవడం, కావలిస్తే అరెస్టు చేయడం అనేది పోలీసులకు మరింత సులభం అవుతుంది.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత వరకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలంటే.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతినుంచి అనుమతి తీసుకోవాలి. అందుకే చట్టసభల ప్రతినిధుల విషయంలో కేసుల్లో పోలీసులు విచారణను ఎంతగా ముందుకు నడిపించినప్పటికీ.. అరెస్టు దగ్గర కొంత మీనమేషాలు లెక్కిస్తుంటారు. జగన్ జమానాలో చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టు చేసినప్పుడు కూడా.. గవర్నరునుంచి ఇలాంటి అనుమతి తీసుకోకుండానే అరెస్టు చేశారనే విషయం చాలా పెద్ద రభస అయింది. జగన్ సర్కారు గనుక.. అలా నియమ నిబంధనలను పట్టించుకోకుండా, కక్షపూరితంగా అరెస్టులు చేయగలుగుతుంది. కానీ, ఎన్ని నేరాలు ఘోరాలు, ఎన్ని వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుల అరెస్టు విషయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆచితూచి, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోంది. అలాంటి రక్షణ ఇప్పుడు విజయసాయిరెడ్డికి లేకుండా పోయింది.

కానీ.. ఆయన మీద కేసులు ఇంకా అలాగే నడుస్తున్నాయి. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదు అని అన్నట్టుగా.. కాకినాడ పోర్టు విషయంలో కేవీరావును బెదిరించి వాటాలను కాజేస్తే.. కేసులు నమోదు అయి విచారణ పర్వం మొదలైన తర్వాత.. గుట్టు చప్పుడు కాకుండా.. ఆ పోర్టులోని వాటాలన్నింటినీ తిరిగి కేవీరావుకే ఇచ్చేశారు. కబ్జా చేసిన వాటాలు కోల్పోయారు గానీ.. విజయసాయికి కేసుల బెడద మాత్రం తీరిపోలేదు. అదే సమయంలో.. విశాఖపట్టణంలో కూడా భూలావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో కొత్త కేసులు నమోదు కాబోతున్నట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఇలాంటప్పుడు.. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఎవ్వరి అనుమతి అవసరం లేదు, ఆయన అరెస్టు చాలా సులువు అయిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు.
నిజానికి ఈ రాజీనామా ద్వారా తాను చాలా బలహీనంగా మారిపోయినట్టు విజయసాయిరెడ్డికి కూడా తెలుసు. ఎంపీగా ఉండడం, పార్టీకి జాతీయ కార్యదర్శిగా ఉండడం వల్ల కాస్త ప్రొటెక్షన్ ఉంటుందిగానీ.. ఇప్పుడు తాను చాలా బలహీనంగా మారిపోయానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

Related Posts

Comments

spot_img

Recent Stories