వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఒకసారి లిక్కర్ కుంభకోణం కేసులో సిట్ పోలీసుల ఎదుటకు విచారణ నిమిత్తం హాజరయ్యారు. సాక్షిగా అనేక విషయాలను వెల్లడించారు. దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లడానికి ఉపయోగపడేలా.. అనేక కీలకమైన సంగతులు ఆయనను విచారించినప్పుడు సిట్ పోలీసులకు తెలిశాయి. ఆయన అందించిన వివరాల ఆధారంగా అనేక మందిని నిందితుల జాబితాలోకి చేర్చారు. ఇదంతా కూడా ఓకే. కానీ.. కేసులో నిందితుల సంఖ్య 40కు చేరిన తర్వాత.. వరుసగా అనేకమందిని విచారించిన తర్వాత.. తెలిసి వస్తున్న కొత్త కొత్త వివరాలు అన్నింటినీ క్రోడీకరించి.. వాటిలో కొన్ని వివరాలను ధ్రువీకరించుకోవడానికి విజయసాయిరెడ్డిని మరోసారి విచారణకు పిలిచినప్పుడు ఆయన డుమ్మా కొట్టారు. తనకు వేరే పని ఉన్నదని.. మరో పదిరోజుల్లోగా వస్తానని ఆయన సిట్ విచారణకు వస్తానని సమాచారం పంపారు. ఈ వ్యవహారంపై పలువురిలో రకరకాల సందేహాలు రేగుతున్నాయి.
విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద నిందలు వేశారు తప్ప.. సూటిగా ఏ కీలక నాయకుల జోలికి కూడా వెళ్లలేదు. లిక్కర్ స్కామ్ లో తనను సాక్షిగా విచారణకు పిలిచినప్పుడు మాత్రం.. చాలా వివరాలు వెల్లడించారు. మూడున్నర వేల కోట్లరూపాయలకు పైగా దోచుకోవడానికి అనుకూలంగా తయారుచేసిన కొత్త లిక్కర్ పాలసీ అనేది.. ఏ రకంగా తన ఇంట్లోనే పురుడుపోసుకున్నదో ఆయన సిట్ పోలీసులకు వివరంగా చెప్పారు. ఆ చర్చలకు తన ఇంటికి ఎవరెవరు వచ్చి.. పాల్గొన్నారో.. అంటే ఈ దోపిడీలో ఎవరెవరికి భాగం ఉన్నదో ఆయన చాలా వరకు చెప్పారు. కొన్ని పేర్ల విషయంలో మాత్రం తనకు గుర్తులేదని బొంకారు.
ఈ విషయంపై అప్పట్లోనే రకరకాల అనుమానాలు వచ్చాయి. అందరి పేర్లు చెప్పి.. కొన్ని పేర్ల విషయంలో గుర్తులేదనం అనడం ద్వారా ఆయన వారితో లోపాయికారీగా కుమ్మక్కు అయ్యారేమోననే వదంతులు వచ్చాయి.
ఇప్పుడు అనూహ్యంగా సిట్ విచారణకు విజయసాయిని పిలిచారు. ఆయన వెంటనే వస్తారని ఇంకా పలువివరాలు చెప్తారని అంతా అనుకున్నారు గానీ.. ఆయన పదిరోజుల్లో వస్తానని సమాచారం పంనడం చిత్రంగా ఉంది. ఆయన ఈ మధ్యకాలంలో బాహ్యప్రపంచంలో కనిపించడం లేదు కూడా. మరి విచారణకు రాకపోవడం అంటే.. వైసీపీకి చెందిన పెద్దలు ఆయనను సంప్రదిస్తున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి. అదే నిజమైతే గనుక.. బేరసారాలు చాలా పెద్దస్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి మౌలికంగా చాలా తెలివైన వ్యాపారి గనుక.. ఇలాంటి అవకాశాన్ని వదులుకోవడానికి ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు. బేరాసారాలు తెగ్గొట్టడానికే ఆయన పదిరోజుల సమయం తీసుకున్నారా? అనే సందేహాలు కూడా పలువురికి కలుగుతున్నాయి.