‘‘వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో నాకు మూడు తరాలుగా అవ్యాజమైన అనుబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. ఆయన పట్ల అభిమానం ఉంది. ఎలాంటి ఒత్తిళ్లు గానీ.. ప్రలోభాలు గానీ నా మీద లేవు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లనే ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేరస్తున్నాను’’ అని విజయసాయిరెడ్డి తన రాజీనామా సందర్భంలో ప్రకటించుకున్నారు. ఇక వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాల జోలికి రాను అంటూ చెప్పుకున్నారు గానీ.. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నారా? జగన్ పట్ల అదే విధేయతతో ఉన్నారా? అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. నిజం చెప్పాలంటే.. విజయసాయిరెడ్డి.. జగన్ మీదకు ఎక్కుపెట్టి వదలిన బాణంగా మారబోతున్నారా? అని కూడా పలువురు సందేహిస్తున్నారు.
విజయసాయిరెడ్డిలో ఆలోచనలు ఈ పాటికి మారి ఉండవచ్చు అనేది పలువురి వాదన. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆయన షర్మిలతో భేటీ కావడం, రెండు- ఆయన నిష్క్రమణం గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
షర్మిల తో భేటీ అయిన తర్వాత.. కొన్ని రోజులకు షర్మిల మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో ఒత్తిడి చేసి తనగురించి విజయసాయితో అబద్ధాలు చెప్పించినట్టుగా ఆయన తనతో అన్నారని షర్మిల ప్రకటించారు. షర్మిల మాటలను విజయసాయి ఖండించలేదు. అయితే.. ఆయన రాజకీయంగా షర్మిలకు అండదండగా ఉండబోతున్నారా? అనే అనుమానాలు పలువురికి కలిగాయి. ఇన్నాళ్లూ జగన్ కు అండదండగా ఉంటూ నిధుల సమీకరణ దగ్గరినుంచి నాయకులను లోబరచుకోవడం, విధేయులుగా ఉంచుకోవడం వరకు అన్ని రకాల వ్యవహారాలను విజయసాయి దగ్గరుండి నడిపించారు. వ్యవహార కుశలతలో ఆయనకు- జగన్ వద్ద ఉన్న ఇతర నాయకులకు తేడా ఉంది. ఆయన ఇప్పుడు షర్మిల పక్షాన చేరితే.. ఆమె జగన్ మీదికి బాణంలా ప్రయోగిస్తారా? అనే అనుమానాలు ఉన్నాయా?
పైగా, విజయసాయిరెడ్డి గురించి జగన్ చులకన చేస్తూ మాట్లాడిన తర్వాత.. జగన్ పట్ల విధేయత ఇంకా మిగిలి ఉంటుందా? అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే.. తన రాజీనామా పోస్టులో జగన్ గురించి చాలా పాజిటివ్ గా పెట్టారు విజయసాయి. జగన్ ఆ మర్యాదను కాపాడుకుని ఉండాలి. ‘‘ఆయన వ్యక్తిగత కారణాలు అన్నారు.. ఏ ఒత్తిడులున్నాయో తెలియదు..’’ అని తప్పించుకుని ఉండొచ్చు. కానీ.. మీడియాతో విజయసాయి గురించి.. ‘ఎంత ఆదరించినా ఇలా రాజీనామాలు చేస్తే మీలో ఏం నిజాయితీ, వ్యక్తిత్వం మిగిలి ఉన్నట్టు..’ అంటూ చాలా చులకనగా మాట్లాడారు. జగన్ అంత చులకన చేసిన తర్వాత.. విజయసాయి పాత విధేయతను కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా? అనేది ఆయనలో అంతర్మధనంగా తెలుస్తోంది.
మొత్తానికి రాబోయే రోజుల్లో విజయసాయి జగన్ మీదకు దేవుడు ఎక్కుపెట్టి వదలిన బాణంగా మారుతారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.