ఉత్తరాంధ్ర వైసీపీలో విజయసాయి ముసలం!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీని మరింత పాతాళంలోకి తీసుకువెళ్లడానికి వ్యూహాలురచిస్తున్నారా? లేదా ఉద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారా? అనేది ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే అర్థం కావడం లేదు. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బహుధా వివాదాస్పదం అవుతున్నాయి. పార్టీలో ముసలం పుట్టిస్తున్నాయి. తాజాగా.. పార్టీలో ఉమ్మడి జిల్లాలు యూనిట్లుగా రీజినల్ కోఆర్డినేటర్లను నియమించిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో దాదాపు పూర్తిగా శిథిలమైపోయిన పార్టీలో కొత్తగా ముసలం పుట్టినట్టుగా విజయసాయిరెడ్డి చేతికి పగ్గాలు అప్పగించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించి మూడు జిల్లాల బాధ్యత అప్పగించడంపై సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఏకంగా జగన్మోహన్ రెడ్డి వద్దనే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. వివాదాస్పద నాయకుడు అయిన విజయసాయిరెడ్డి ని రెండోసారి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా నియమించడం ద్వారా ఆ మూడు జిల్లాల పార్టీ కేడర్ కు ఎలాంటి సంకేతాలు ఇవ్వదలచుకున్నారు.. అని జగన్ ను గట్టిగానే నిలదీసినట్టు తాడేపల్లి వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి గతంలో, అంటే జగన్ అధికారంలో ఉన్న రోజుల్లోనే, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఇన్చార్జిగా పనిచేశారు. ఆ సమయంలో అక్కడి నాయకుల్ని చాలా చులకనగా చూసేవారిని, అక్కడి నాయకులకు వ్యతిరేకంగా గోతులు తవ్వేవారని కూడా విమర్శలను మూటగట్టుకున్నారు. ఆయన పట్ల పార్టీ నాయకుల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. పలువురు ఆయన తీరుగురించి జగన్ కు ఫిర్యాదులు చేశారు కూడా. ఏ ఫిర్యాదులు పనిచేశాయో తెలియదు గానీ.. ఎన్నికలకు సుమారు ఏడాది ముందు జగన్ విజయసాయిని ఆ పదవినుంచి తప్పించారు. టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను పూర్తిచేసుకున్న బాబాయి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఉత్తరాంధ్ర బాధ్యతీలు పెట్టారు. ఎన్ని ప్రయోగాలు చేసినా అవన్నీ కూడా వికటించాయి. పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. మూడు జిల్లాలకు కలిపి కేవలం రెండు సీట్లలో పార్టీ గెలిచింది.

నిజంచెప్పాలంటే గత ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర దాదాపు మొత్తం బాధ్యతను బొత్స చూసుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయగా, ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలో ఉన్నారు. మూడు జిల్లాల పార్టీ బాధ్యతను ఆయన చూశారు. కాగా.. ఇప్పుడు మళ్లీ విజయసాయిరెడ్డి చేతిలో ఎందుకు అధికారం పెడతారంటూ బొత్స గట్టిగా గొడవపడినట్టు సమాచారం. నిజానికి రీజినల్ కోఆర్డినేటర్ల జాబితా మూడు రోజుల ముందే సిద్ధమైనప్పటికీ బొత్స అభ్యంతరాల కారణంగా ఆపారని, జగన్, బొత్సను బుజ్జగించిన తర్వాత ఆలస్యంగా జాబితా ప్రకటించినట్టు సమాచారం. మొత్తానికి ఈ నియామకాలతో ఉత్తరాంధ్రలో విజయసాయి- బొత్స ఆధిపత్యాల నడుమ ముసలం పుట్టినట్టేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories