రాజకీయంగా ఇంత చవకబారుతనం మరొకటి ఉండకపోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్సులో పడిపోయి.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏం పడితే అది చేసేస్తోందని.. నోటికి ఏ నింద వేయాలనిపిస్తే అది వేసేస్తోందని దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది. మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తే దానిని కడుక్కోవడం అవతలి వాళ్ళ పని- అనే అత్యంత నీచమైన దుష్ప్రచార సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే… ఆయనను వ్యతిరేకించే వారు కూడా కన్నీరు కార్చారు. అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణం గమనిస్తుంటే- రాజకీయంగా గతి లేని స్థితిలో పడిఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. వైయస్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టాలని ఆరాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి చవకబారు ప్రయత్నాలతో జగన్మోహన్ రెడ్డి ఆస్తుల తగాదా కోసం అనుసరిస్తున్న కుటిల మార్గాల నుంచి ప్రజల దృష్టిని మరల్చగలమని వైసిపి నాయకులు భావిస్తున్నారేమో తెలియదు.
అన్నాచెల్లెళ్ల మధ్య రచ్చకెక్కిన ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకూడదనే అజెండాతోనే షర్మిల పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆమెతో ప్రతిమాట చంద్రబాబునాయుడు మాట్లాడిస్తున్నారని తేల్చేసిన ఈ చార్టెర్డ్ అకౌంటెంట్ ఆమెది ఆస్తితగాదా కాదని.. అధికారం కోసం తగాదా అంటూ ధ్వజమెత్తారు.
చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసమే షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారంటూ, చంద్రబాబుతో కలిసి ఆమె పని చేస్తున్నారంటూ.. జగన్ పట్ల మహిళల్లో వ్యతిరేకత రావడం కోసమే ఇదంతా చేస్తున్నారంటూ విజయ్ సాయి రెడ్డి అభివర్ణిస్తున్నారు. ఇంతవరకూ పరవాలేదు. వైసీపీ నాయకులు అందరూ చేస్తున్న పని ఇదే. అయితే విజయసాయిరెడ్డి నిందలు వేయడంలో కూడా తనదైన సొంత ముద్ర ఉండాలని తపన పడుతున్నారో ఏమో తెలియదు గానీ, వైయస్సార్ మరణ కారణాలను కూడా ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు.
వైయస్సార్ ఘోరమైన మరణం పొందుతారని చంద్రబాబు అన్నారట! ఆ మాట అన్నారో లేదో తర్వాతి సంగతి అలా అని పేర్కొంటూ ‘మీ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తులతో చేతులు కలుపుతారా? చంద్రబాబుతో కలిసి జగన్ పై కుట్ర పడటం న్యాయమేనా? షర్మిల చేసే పనికి దిగంగత వైయస్సార్ ఆత్మ శోభించదా?’ అని విజయసాయిరెడ్డి చిత్రంగా ప్రశ్నిస్తున్నారు! వైఎస్సార్ మృతికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబులతో చేతులు కలుపుతారా అని ఆయన అడుగుతున్నారు. ఇతర ఆరోపణలు ఎన్ని అయినా చేయవచ్చు.. రాజకీయలేకితనానికి అవి నిదర్శనం అని మనం సరిపెట్టుకోగలం. కానీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణిస్తే దానిని కూడా చంద్రబాబు చేయించిన హత్య లాగా విజయసాయిరెడ్డి మాట్లాడడం అనేది పతనానికి పరాకాష్ట లాగా కనిపిస్తోంది! మరి ఈ వ్యవహారాన్ని ఇంకా ఎన్నెన్ని మలుపులు తిప్పుతూ ఎన్ని కొత్త ఆరోపణలతో రక్తి కట్టిస్తారో వేచి చూడాలి!!