అల్ ఖైదా ఉగ్రవాద నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమొనర్చిన సంగతి మీకు గుర్తుందా? లాడెన్ ను హత్య చేస్తున్నప్పుడు.. లైవ్ వీడియోను అమెరికాలోని అధ్యక్షుడు బరాక్ ఒబామా వీక్షించారు. మాజీ మంత్రి విడదల రజనిలో అంతకు మించిన స్థాయి శాడిజం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ ఆమె ఉగ్రవాదుల భరతం పట్టడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద విమర్శలు చేసిన వారి మీద అదే స్థాయిలో కక్ష తీర్చుకున్నారు. వారిని పోలీసులతో కొట్టిస్తూ ఆ లైవ్ వీడియోలను చూసినట్టుగా ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు అందింది.
విడదల రజని- జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు మీద అప్పట్లో సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వారి మీద తీవ్రమైన కేసులు పెట్టి వేధించారు. కేసులు పెట్టకుండా కూడా అనధికారికంగా నిర్బంధించి వేధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి సంఘటనలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు (కోటి) తాజాగా పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. జగన్ పాలన కాలంలో అప్పటి సీఐ సూర్యనారాయణ తనను అయిదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపిస్తున్నారు. వైసీపీని విమర్శించే పోస్టులు పెట్టినందుకే అప్పటి మంత్రి విడదల రజని ఇలా చేయించారని చెబుతున్నారు.
సీఐ అప్పట్లో తనను పోలీసు స్టేషన్లో కొడుతూ.. ఆ దృశ్యాలను మంత్రి రజనికి చూపించారని కూడా కోటి చెబుతున్నారు. అప్పటి సీఐతో పాటు విడదల రజని, ఆమె వ్యక్తిగత సహాయకులు జయఫణీంద్ర కుమార్, రామక్రిష్ణ ల మీద కూడా ఫిర్యాదు చేశారు.
విమర్శలు కాదు కదా.. అసభ్యత నిండిన పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తల మీద ఇప్పటి ప్రభుత్వం కేసులు నమోదుచేస్తూ ఉంటే.. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో గగ్గోలు పెడుతున్నారు. తమ కార్యకర్తలను వేధిస్తున్నారని అంటున్నారు. అరెస్టులు జరిగితే అవి తనతోనే మొదలు కావాలని జగన్ సవాళ్లు విసురుతున్నారు. కానీ.. ఆయన ప్రభుత్వ కాలంలో తెదేపా వారిని ఏ రీతిగా వేధిచారో తెలుసుకోవడానికి విడదల రజని ఉదాహరణ సరిపోతుందని ప్రజలు అంటున్నారు.