మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలోపడిన ఎలుక లాగా తయారైంది. ఆయనలోని రాజకీయ అవకాశవాదాన్ని, పలాయనవాదాన్ని నిరూపించడానికేనా అన్నట్టుగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ముంచుకువచ్చింది. ఒకవైపు ఎన్డీయే సారథి నరేంద్రమోడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేద్దాం అని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అన్నంటికీ ప్రతిపాదిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. జగన్ ఖర్మకొద్దీ.. అన్నట్టుగా కాంగ్రెస్ .. ఇండియా కూటమి తరఫు అభ్యర్థిగా రాజకీయ అనుబంధం లేని తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అయితే అందుకు తగ్గట్టుగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. రాజకీయాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్ కు లేదని, ఆయన ఎవ్వరి ఎదుటా సాగిలపడిన వ్యక్తి కాదని అంటున్న కాంగ్రెస్ విమర్శలను జగన్ నిజం చేస్తున్నారు.
ఇండియాకూటమి కూడా అభ్యర్థిని నిలిపిన తర్వాత.. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి చాలా సమస్యలను తెచ్చిపెడుతోంది. అలాగని ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయలేరు. మోడీని ధిక్కరించి ఏ చిన్న నిర్ణయమైనా తీసుకోగల ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు అని అందరికీ తెలుసు. ఒకసారి మోడీ తరఫున సాక్షాత్తూ కేంద్ర రక్ష్ణణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఫోను చేసి .. ఎన్డీయేకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన తర్వాత.. జగన్ కు ఇంకో గత్యంతరం లేదు. రాజ్ నాధ్ మాటలు సహకారం కోరిన విజ్ఞప్తిలాగానే కనిపించవచ్చు. కానీ.. అవి శిరసావహించాల్సిన ఆదేశాలు అనుకున్నంత వరకే జగన్ భవిష్యత్తు బాగుంటుంది.
ఇప్పటికి కూడా రాజకీయంగా తాను బద్నాం కాకుండా.. మోడీ ఎదుట సాగిలపడుతున్నట్లుగా విమర్శలకు గురికాకుడా పరువు కాపాడుకోవడానికి జగన్ ఎదుట ఒక మార్గం ఉంది. ఆయన ఇండియా అభ్యర్థికి ఓటు వేయకపోవచ్చు. తద్వారా మోడీ దళానికి మరింత ఆగ్రహం తెప్పించకుండా ఉండవచ్చు. కనీసం ఎన్నికల్లో పాల్గొనకుండా తన పార్టీ వారిని దూరం ఉంచినాకూడా కొంత పరువు దక్కుతుంది. కానీ.. తమ ఆదేశానికి భిన్నంగా అలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కమలపెద్దలు అసంతృప్తి చెందుతారు. వారిని నొప్పించగల ధైర్యం జగన్ కు లేదు. కానీ ఆయన ఎన్డీయే అనుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా.. విధిలేని పరిస్థితుల్లో ఎన్ని విమర్శలనైనా ఎదుర్కోవడానికి సిద్ధ పడాల్సిందే. మోడీ తన శత్రుకూటమి నాయకుడే అయినప్పటికీ.. ఆయన ప్రాపకంకోసం దిగజారే నేతగా ముద్రపడాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.