రాంగోపాల్ వర్మ అంటేనే పెడసరం మనిషి. ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. వ్యూహం సినిమాకు సంబంధించి.. ఏవో నాలుగు టికెట్లు అమ్ముకుందాం అనే ఆశతో చంద్రబాబు,లోకేష్, పవన్ కల్యాణ్ మీద పెట్టిన మార్ఫింగ్ వెటకారపు పోస్టులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. పోలీసు కేసులు నమోదు అయితే.. అసలు నామీద కేసులు పెట్టడానికి వారెవరు? ఏడాది కిందటి వ్యవహారాలకు ఇప్పుడు కేసులెలా పెడతారు? ఎప్పుడు ఏం పోస్టులు పెట్టానో కూడా నేను మర్చిపోయా లాంటి చిత్రమైన జవాబులు చెప్పిన రాంగోపాల్ వర్మ.. హైకోర్టును ఆశ్రయించి విచారణ తప్పించుకోవడానికి నానా ఎత్తుగడలు వేసిన ఆయన చిట్టచివరికి ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే తన పెడసరం ధోరణుల్ని అక్కడ కూడా యథాతథంగా ప్రదర్శించారు.
పోస్టులు పెట్టిన ఎక్స్ ఖాతా తనదే గానీ.. అందులో పోస్టులు ఎవరు పెట్టారో తెలియదంటూ వర్మ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దాదాపు తొమ్మిది గంటలపాటు విచారణ సాగితే.. పోలీసులు 40కి పైగా ప్రశ్నలున సందించారు. చాలా ప్రశ్నలకు సమాధానమే ఇవ్వలేదని తెలుస్తోంది రాత్రి 9 వరకు విచారించిన పోలీసులు వర్మ ఏమాత్రం సహకరించకుండా అసలు జవాబులే ఇవ్వకుండా చేస్తుండడంతో చివరికి సెల్ ఫోను స్వాధీనం చేయాలని అడిగారు.
అందుకు కూడా రాంగోపాల్ వర్మ చిత్రమైన సమాధానాలు చెప్పారు. తాను ఫోను లేకుండా వచ్చానని, కారులో మరచిపోయానని, కారు తిరిగి హైదరాబాదు వెళ్లిందని రకరకాల మాటలు వల్లించినట్టుగా తెలుస్తోంది. విచారణకు సహకరించకపోవడం వల్ల వర్మను మరోసారి రావాల్సిందిగా పోలీసులు కోరనున్నట్టు సమాచారం.
నిజం చెప్పాలంటే.. వర్మకు ఉన్న ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. ఆయన హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. తనను వర్చువల్ గా విచారించవచ్చునని చాలా మాట్లాడారు గానీ.. పోలీసుల ఎదుటకు వెళ్లి విచారణకు సహకరించాలని హైకోర్టు పురమాయించింది. దీంతో వేరే గతిలేక ఒంగోలు పోలీసుల ఎదుటకు వచ్చారు. సహకరించకుండా.. మరోసారి విచారణకు నోటీసులు అందుకోనున్నారు.
అయినా.. తన ఫోను ఎవరు వాడారో.. వివాదాస్పద పోస్టులు ఎవరు పెట్టారో తెలియదని అన్నంత మాత్రాన రాంగోపాల్ వర్మ తప్పించుకోజాలరని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో పోస్టులు తనే పెట్టినట్టుగా చెప్పుుని.. ఇప్పుడు ఎవరు పెట్టారో తెలియదంటే.. న్యాయస్థానం సీరియస్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.