దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్నెన్నో వివాదాస్పద చిత్రాలు తీశారు. కేవలం అవి వివాదాస్పద అంశాలు కావడం వల్ల మాత్రమే ఆయన వాటిని తీయడానికి పూనుకున్నారు. వివాదాన్ని చిత్రంగా మలిచే ధైర్యం ఉండబట్టి మాత్రం కాదు. కానీ ఏ చిత్రాల్ని కూడా ఆయన ఇంత ఎక్కువ కాలం భారం మోస్తూ ఉండవలసిన అవసరం రాలేదు. జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి తీసిన చిత్రాలు మాత్రం.. రాంగోపాల్ వర్మ ను బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నట్టుగా చుట్టుకుని.. ఎంతకూ వదలడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ‘నీలిదళం’ ఉచ్చులో చిక్కుకుపోయి.. వారి సూచనలు సలహాల మేరకు నడుచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలను గమనిస్తున్న వారు మాత్రం.. నీలిదళం సలహాలను పాటిస్తూంటే.. వర్మ మరింతగా చిక్కుల్లో ఇరుక్కుపోతారని అంటున్నారు.
కేవలం వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో చంద్రబాబు, పవన్ తదితరులపై పెట్టిన వెకిలి మార్ఫింగ్ పోస్టులు మాత్రమే కాదు.. అంతకంటె ముందు తీసిన ‘కమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే చిత్రం కూడా వర్మ మెడకు గుదిబండలా చుట్టుకుంటున్నది. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టుగా.. రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోరంగా తుస్సుమన్నాయి గానీ.. వాటి ఎఫెక్టు మాత్రం ఆయన జీవితంలోంచి తొలగిపోవడం లేదు.
రాంగోపాల్ వర్మ గతంలో ‘కమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ టైటిల్ తో సినిమా తీశారు. సెన్సార్ అభ్యంతరాలు రావడంతో.. దాని టైటిల్ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అయితే ఒరిజినల్ టైటిల్ తోనే యూట్యూబ్ లో అప్‌లోడ్ చేశారని, అందులోని ఉద్రేకపూరిత దృశ్యాలను కూడా తొలగించలేదని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో వర్మను విచారించేందుకు ఏపీ సీఐడీ పోలీసులు వర్మకు నోటీసులు జారీచేశారు. ఒంగోలులో విచారణకు హాజరైనప్పుడే ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది.
అయితే పోలీసుల విచారణకు డుమ్మా కొట్టేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉండే రాంగోపాల్ వర్మ బుద్ధి మాత్రం మారలేదు. ముందస్తు బెయిలు దక్కినప్పటికీ.. తప్పుడు పోస్టుల విషయంలో వర్చువల్ విచారణ, ఆన్ లైన్ విచారణ లాంటి నాటకాలతో ప్రయత్నించినప్పటికీ.. కోర్టు ఆయనకు మొట్టికాయ వేసింది. పోలీసుల విచారణకు స్వయంగా హాజరు కావాల్సిందేనని తెలియజెప్పింది. వేరే గతిలేక వర్మ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అక్కడ ‘కమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ సినిమా వ్యవహారానికి సంబంధించిన నోటీసులు వచ్చాయి. అయితే.. వైసీపీ నేతల ఉచ్చులో ఉంటూ.. వారి సలహాల మేరకు నడుచుకుంటున్న వర్మ.. ఆ విచారణకు కూడా డుమ్మా కొట్టారు. తను సినిమా ప్రమోషన్లో ఉన్నానంటూ.. న్యాయవాదిని పంపారు. తనకు 8 వారాల గడువు కావాలని కోరారు. ఒకసారి అనుభవంలోకి వచ్చినాసరే.. విచారణను ఎగ్గొట్టి సాధించేది లేదని అర్థం చేసుకోలేక.. వర్మ తన మీద కేసులను మరింత చిక్కుముడిలాగా స్వయంగా మార్చుకుంటున్నారని ప్రజలుసానుభూతి వ్యక్తం చేస్తున్నారు.