సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువలన తాను విచారణకు హాజరు కావడానికి రెండువారాల గడువు కావాలని కోరుతూ రాంగోపాల్ వర్మ తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం అందజేశారు. వ్యూహం సినిమా విడుదల అయినప్పుడు.. దాని ప్రచారం కోసం అప్పట్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేయించి అసభ్యమైన రాతలు, అనుచితమైన రీతిలో వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. దానికి సంబంధించి ఏపీలో పలు పోలీసు స్టేషన్లలో కేసులో నమోదు అయ్యాయి.
ప్రకాశం జిల్లా మద్దిపాడులో నమోదు అయిన కేసులకు సంబంధించి పోలీసులు వచ్చి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశారు. తీరా విచారణకు హాజరు కావాల్సిన రోజున డుమ్మా కొట్టారు. తనకు నాలుగురోజుల గడువు కావాలని అప్పట్లో ఆయన పోలీసులను అభ్యర్థించారు. అయితే ఈలోగా తన మీద పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాలని, కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. తనకు అరెస్టునుంచి రక్షణ కల్పించాలని వర్మ కోరినప్పటికీ కూడా హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత.. ముందస్తు బెయిలు కావాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.
ఈలోగా ఈ నెల 20న ఒంగోలు పోలీసులు మరోసారి వర్మకు నోటీసులు ఇచ్చారు. 25వ తేదీన సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే ఇవాళ్టి విచారణకు కూడా వర్మ డుమ్మా కొట్టారు. తన బిజీ షెడ్యూలు కారణంగా విచారణకు రాలేకపోతున్నట్టు, తనకు అదనంగా మరో రెండు వారాల సమయం కావాలన్నట్టు ఆయన లేఖపంపారు.
రాంగోపాల్ వర్మ ఈ రకంగా పదేపదే గడువు కోరుతూ ఉంటే పోలీసులు అనుమతిస్తారా? లేదా, అదుపులోకి తీసుకుని విచారించేలా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అయితే రాంగోపాల్ వర్మ న్యాయవాది మాత్రం రాంగోపాల్ వర్మ మీద పెట్టిన కేసులోనే బలం లేదని అంటున్నారు. ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఆయన అంటున్నారు. మరి వర్మ వైఖరి ఈ కేసును ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.