రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అనిత తిరుమలలో చెప్పిన ఒక మాట అందరికీ ఆదర్శంగా నిలిచే మాట. తిరుమలలో విలేకరులు చాలా సహజంగా వంగలపూడి అనితను కలిసి చాలా విషయాల మీద ఆమె అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరారు. ఇందకు జవాబుగా.. అనిత.. తాను దైవదర్శనానికి వచ్చానని.. తిరుమలలో సాంప్రదాయాలు మాత్రమే పాటిస్తానని.. అంతేతప్ప ఇక్కడ రాజకీయాలు మాట్లాడబోనని అనిత ఒక్కమాటలో తేల్చేశారు.
నిజం చెప్పాలంటే అనిత చెప్పిన ఆ ఒక్క మాట తిరుమలకు వచ్చే ప్రతి నాయకుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో.. తిరుమల పవిత్రతను ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా భ్రష్టుపట్టించారు. ఆ క్రమంలో తిరుమలలో అనుచితమైన రీతిలో రాజకీయ విషయాలు మాట్లాడడం కూడా ఒకటి. ప్రతినెలా ఒక గుంపును తనతోపాటూ ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలకు తీసుకు వెళ్లే అలవాటు ఉన్న రోజా వంటి వారైతే.. దర్శనం పూర్తిచేసుకుని బయటకు రాగానే.. మీడియా వాళ్లు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కునేవాళ్లు. జగనన్న పరిపాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నా అనే పడికట్టు డైలాగుతో ప్రారంభించి.. చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను, నారా లోకేష్ ను అత్యంత లేకి పదజాలంతో తిట్టిన తర్వాత.. అక్కడినుంచి తిరిగి వెళ్లేవారు కాదు.
వైసీపీకి చెందిన ప్రతినాయకుడూ గుడిలోకి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం.. బయటకు వచ్చి జగన్ భజన చేయడం ఒక సాంప్రదాయంగా మార్చుకున్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా మహిళకు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియో లీక్ అయినప్పుడు.. ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమలలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. సదరు నగ్న సంభాషణల ఎంపీ గోరంట్ల మాధవ్ చర్యలను సమర్థిస్తూ బరితెగించి మాట్లాడారు. తిరుమల పవిత్రతను ఆయన ఆ రకంగా కూడా భ్రష్టు పట్టించారు. అయితే తిరుమలలో నాయకులు ఎలా ప్రవర్తించాలో ఒక ప్రమాణాలు సెట్ చేసేలాగా.. హోం మంత్రి వంగలపూడి అనిత తిరుమలకు దైవదర్శనార్థం వచ్చానని.. ఇక్కడి సాంప్రదాయాలు పాటిస్తానే తప్ప.. రాజకీయాలు మాట్లాడనని తెగేసి చెప్పారు. నాయకులందరూ కూడా తిరుమల వచ్చినప్పుడు అనిత మాటలను ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది.