137 రోజులు జైలులో గడిపిన తర్వాత.. బయటకు వచ్చిన వల్లభనేని వంశీకి బెయిల్ అనేది మూన్నాళ్ల ముచ్చటగా మారనున్నదా? ఆయన మీద నమోదు అయిన అనేక కేసుల్లో కొన్నింటిలో ముందస్తు బెయిళ్లు, కొన్నింటిలో షరతులతో కూడిన బెయిళ్లు లభించిన నేపథ్యంలో.. ఆయన జైలునుంచి బయటకు వచ్చారు. కానీ ఒక కేసులో ప్రభుత్వం వాదనలు పూర్తిగా వినకుండానే.. హైకోర్టు బెయిలు మంజూరు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం కోర్టు తాజాగా.. బెయిల్ ఉత్తర్వులను పక్కన పెట్టి.. ప్రభుత్వ వాదన కూడా విన్న తరువాత మాత్రమే హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో.. వంశీ బెయిలు పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఇప్పటికిప్పుడు అరెస్టు జరగకపోయినా.. హైకోర్టులో విచారణలు పూర్తయ్యాక గానీ.. నింపాదిగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి!
వివరాల్లోకి వెళితే..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమీద అనేక కేసులు ఉన్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్, భూకబ్జాలు, నకిలీ ఇళ్లపట్టాలు ఇలా వివిధ కేసుల్లో ఆయన 137 రోజులు జైల్లో గడిపారు. బెయిళ్లు వచ్చిన తర్వాత విజయవాడ జైలునుంచి ఈనెల 2న బయటకు వచ్చారు.
అయితే వల్లభనేని వంశీ మీద అక్రమ మైనింగుకు సంబంధించిన కేసు కూడా ఉంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండానే.. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని ఆరోపిస్తూ.. ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను అనుమతించిన సుప్రీం కోర్టు.. వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించి ఆ మేరకు ఈ పిటిషన్ పై తాజాగా మళ్లీ విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి తాము వెళ్లడం లేదని, హైకోర్టు ఇరుపక్షాల వాదనలను పూర్తిగా విన్న తరువాత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దాంతో.. వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేస్తాం అంటూ.. ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలియజేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత.. నాలుగు వారాల్లోగా విచారణ ముగించి తుది తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది.
అంటే వంశీకి దక్కిన బెయిల్ సందిగ్ధంలో పడిందన్న మాట. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత.. అక్రమ మైనింగ్ కేసులో ఆయన పాత్ర గురించి హైకోర్టు పూర్తిగా వాదనలు వినాల్సి ఉంటుంది. నాలుగువారాల్లోగా తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున అప్పటిదాకా వంశీకి దిగుల్లేదు. అంటే మరో అయిదు వారాల్లోగా వంశీ గత ప్రభుత్వ హయాంలో పాల్పడిన అనేకానేక దురాగతాల్లో ఒకటైన అక్రమమైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలోనే నిజమున్నదని కోర్టు నమ్మితే గనుక.. ఆ కేసులో ఆల్రెడీ ఆయనకు దక్కిన ముందస్తు బెయిల్ రద్దవుతుంది. మిగిలిన కేసుల్లో రకరకాల బెయిళ్లు వచ్చినప్పటికీ.. అయిదు వారాల తర్వాత.. వంశీ మళ్లీ జైలుకు వెళ్లవలసిన పరిస్థితి తప్పకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.