2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత సొంత ప్రయోజనాలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించడం మాత్రమే కాకుండా.. తెలుగుదేశం పట్ల చాలా దుర్మార్గంగా అసహ్యంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం విదేశాలకు పారిపోయారా? చంద్రబాబునాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తన అరాచకాల మీద దృష్టి సారిస్తారని, తాను తప్పించుకునే అవకాశాలు తక్కువని ముందే తెలుసుకున్న వంశీ ముందుగానే జారుకోవడానికి పోలీసు శాఖలో ఆయనకు అనుకూలురైన మనుషులే సమాచారం అందించారా? ఆయనకోసం పోలీసులు వేట ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు రకరకాల అనుమానాలు ముప్పిరిగొంటున్నాయి.
మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి.. తన అనుచర గూండాలను దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో వంశీ పేరును 71వ నిందితుడిగా చేర్చారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనలేదు. కానీ, కొన్ని అరెస్టులు జరిగినతర్వాత వంశీ ప్రేరణతోనే దాడి జరిగినట్లుగా పోలీసులు ఒక నిర్ధరణకు వచ్చారు. ఆ మేరకు ఆయన కోసం ఇప్పుడు గాలింపు మొదలైంది.
వంశీ కుటుంబం హైదరాబాదులో నివాసం ఉండడంతో.. ఆయనను అరెస్టు చేసి తీసుకురావడానికి ఇప్పటికే మూడు పోలీసు బృందాలు హైదరాబాదుకు చేరుకున్నాయి. అయితే ఆయన ఆచూకీ తెలియలేదు. కొన్ని వారాల కిందటే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయి ఉంటారనే అనుమానం కూడా పలువురిలో కలుగుతోంది.
చంద్రబాబునాయుడు కుటుంబసభ్యుల గురించి అసహ్యంగా మాట్లాడడం ద్వారా.. వంశీ గత ప్రభుత్వ కాలంలో ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన మాటల తీరుకు యావత్ రాష్ట్రంలోని ప్రజలు వంశీని అసహ్యించుకున్నారు. ఆయనను మాత్రమే కాదు. కనీసం ఆయన మాటలను ఖండించకుండా, ఆయనను మరింతగా ప్రోత్సహించిన జగన్ ను కూడా ఆ విషయంలో ప్రజలు అసహ్యించుకున్నారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారం జోలికి వెళ్లలేదు.
కానీ మంగళగిరి తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసులో మాత్రం పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురి అరెస్టులు కూడా జరిగాయి. అసలు సూత్రధారుల్ని పోలీసులు పట్టించుకోకుండా ఎవరెవరినో అరెస్టు చేస్తున్నారంటూ పార్టీనుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వంశీ అరెస్టుకోసం తీవ్రంగా డిమాండ్లు రావడంతో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగారు. హైదరాబాదులో గాలింపులు జరుగుతున్న నేపథ్యంలో, వంశీ ఇప్పటికే దేశం విడిచి పరారైపోయి ఉంటే గనుక.. ఆయన కోసం లుక్ అవుట్ నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.