ఆయన పార్టీనుంచి అనేకమంది వివిధ రకాల కేసుల్లో పోలీసు విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. అరెస్టులు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే దాదాపుగా వారందరూ కూడా ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తమ ఫోను మాత్రం పోలీసుల చేతికి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. తన పార్టీలోని నేర సహచరుల జాగ్రత్తలు, వల్లభనేని వంశీకి కూడా ముందుజాగ్రత్తను నేర్పాయి. ఆయన అరెస్టు అయిన సమయం నుంచి తన ఫోను దాచేశారు. అయినా ‘కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై..’ అనే డైలాగును వంశీ మరచిపోయారో ఏమోగానీ.. ఫోను దాయగలిగారు గానీ.. నేరాన్ని దాచలేకపోతున్నారు.
వల్లభనేని వంశీని పోలీసులు తెల్లవారుజామున ఇంటికి వెళ్లి సుమారు 8 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకుని తరలించారు. అప్పటిదాకా ఆయన తన న్యాయవాదులకు, పార్టీలోని సహచరులకు, కార్యకర్తలకు రకరకాల వర్గాలకు ఫోన్లు చేసుకున్నారు. ఇక పోలీసులు విడిచిపెట్టరని, తాను తప్పించుకోజాలనని అర్థమైన తరువాత.. ఆయన వారి వెంట బయల్దేరారు. ఈలోగా ఆయన తీసుకున్న అతిపెద్ద జాగ్రత్త ఫోనును దాచేయడం. అరెస్టు చేసిన తర్వాత.. విచారణ నిమిత్తం ఫోను అడిగిన పోలీసులు ఆయన లేదనడంతో.. సెర్చ్ వారెంటుతో మళ్లీ హైదరాబాదు వచ్చి ఇల్లంతా క్షుణ్నంగా వెతికారు. కానీ ఫోను దొరకలేదు. కానీ.. నేరాలను నిరూపించడానికి ఫోను కూడా ఉపయోగపడడం నిజమే గానీ.. ఫోను లేకపోయినంత మాత్రాన నేరం మరుగున పడిపోతుందని అనుకోవడం భ్రమ. ఈ లాజిక్ ను వల్లభనేని వంశీ మిస్సయ్యారు. సీసీ కెమెరాల సాక్ష్యంగా పోలీసులు సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేయించిన వైనం మొత్తం సాధికారికంగా నిరూపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తూ జరిగిన దాడి గురించి అప్పట్లో ఫిర్యాదుచేసిన సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ కోర్టులో భిన్నమైన వాంగ్మూలం ఇచ్చారు. అదంతా వల్లభనేని వంశీ స్కెచ్ ప్రకారం జరిగింది. సత్యవర్దన్ ను బెదిరించిన వంశీదళం కిడ్నాపు చేసి మరీ ఆ వాంగ్మూలం ఇప్పించారు.
కాల్ రికార్డుల్లో ఈ సంగతి దొరికిపోకుండా.. వంశీ తన ఫోను దాచేసి పోలీసులను బురిడీ కొట్టించగలనని అనుకున్నాడు. కానీ.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన తర్వాత.. హైదరాబాదులోని వంశీ ఇంటికి తీసుకువెళ్లిన దృశ్యాలు, అక్కడినుంచి మరునాడు ఉదయం తరలించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో దొరికాయి. అలాగే అతడిని విశాఖకు తరలించినట్టుగా, వంశీ అనుచరులే.. దగ్గరుండి ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకువచ్చినట్టుగా.. అన్నీ సీసీ కెమెరా ఫుటేజీలు దొరికాయి. దీంతో ఫోను దాచగలిగిన వంశీ నేరాన్ని మాత్రం దాచలేకపోయారు. ఇంకా మరిన్ని ఆధారాలు సేకరించి.. పక్కాగా కోర్టుకు సమర్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. వంశీ ఫోను కనిపించకపోయినంత మాత్రాన… ఇతర మార్గాల్లో కాల్ రికార్డులు, ఫోన్ లొకేషన్ లు ట్రాక్ చేయడం ద్వారా నేరాన్ని తేల్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.